పోలింగ్ షురూ : భారీ పోలింగ్ పైనే పార్టీల ఆశలు

రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఈ ఎన్నికకు అటు అధికారులు, ఇటు పార్టీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఓటరు తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఓటర్లు భారీగా తరలివచ్చి ఓట్లు వేస్తారా.. లేదా అన్న టెన్షన్ అందరినీ వేధిస్తోంది. వరుస ఎన్నికలతో నిరాసక్తత, డబ్బుల పాత్ర లేకపోవడం, కరోనా భయం, ఎండల తీవ్రత తదితర కారణాల పోలింగ్ శాతంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. కారణం ఏదైనా ఓటింగ్ తగ్గితే పార్టీల లక్ష్యాలు దెబ్బతింటాయన్న ఆందోళన కనిపిస్తోంది.

పార్టీల ఆకాంక్షలు

తిరుపతి ఎంపీ నియోజకవర్గ పరిధిలో సుమారు 17.50 లక్షల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 55 శాతం ఓట్లు.. 2.33 లక్షల ఆధిక్యతతో విజయం సాధించింది. గత 22 నెలల ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సానుకూలత ఉన్నందున అప్పటికంటే ఎక్కువ మెజారిటీ సాధించాలన్నది ఆ పార్టీ లక్ష్యం. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునేల విజయం సాధించాలని టీడీపీ తాపాత్రయపడుతోంది. అదే సమయంలో టీడీపీని వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలవడం ద్వారా రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి తానే అసలైన ప్రత్యామ్నాయమని చాటుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. వీటిలో ఏ ఒక్కరి లక్ష్యం నెరవేరాలన్నా భారీ ఓటింగ్ జరగాల్సిందే.

భయపెడుతున్న అంశాలు

ఈ కాలంలో ఎన్నికలంటేనే డబ్బులు. నోటు అందనిదే ఓటు వేయని పరిస్థితి దాపురించింది. కానీ ప్రస్తుత తిరుపతి ఉప ఎన్నికలో విచిత్రంగా కరెన్సీ ప్రభావం పెద్దగా కనిపించడంలేదు. సాధారణంగా అధికార పార్ట్ ఎక్కువ డబ్బులు వేదజల్లుతుంటుంది. కానీ గత 22 నెలల పాలనలో దాదాపు అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో ఆర్థిక లబ్ది చేకూర్చినందున ప్రత్యేకించి ఓటర్లకు సొమ్ము ఇవ్వాల్సిన అవసరం లేదని అధికార వైసీపీ భావించింది. అధికార పార్టీయే తీయనప్పుడు మనమెందుకన్నట్లు ప్రతిపక్ష అభ్యర్థులు కూడా సొమ్ము ఊసెత్తడం లేదు. అయితే డబ్బులకు అలవాటు పడిన ఓటర్లు ఈ పరిణామాన్ని ఎలా స్వీకరిస్తారన్న అనుమానాలున్నాయి.

గత రెండు నెలలుగా వరుస ఎన్నికలు జరుగుతున్నాయి. మొదట పంచాయతీ, తర్వాత మున్సిపల్, అనంతరం పరిషత్ ఎన్నికలు జరిగాయి. పంచాయతీ, మున్సిపల్ పోలింగుకు భారీగానే తరలివచ్చిన ఓటర్లు పరిషత్ ఎన్నికలకు వచ్చేసరికి అంత ఆసక్తి చూపలేదు. ఇప్పుడు ఉప ఎన్నికలో అదే పునరావృతం అవుతుందేమోనన్న ఆందోళన పార్టీల్లో కనిపిస్తోంది. వీటికి తోడు కొద్ది రోజులుగా ఎండ తీవ్రత, కరోనా ఉధృతి బాగా పెరిగాయి. ఉప ఎన్నిక జరుగుతున్న తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం విస్తరించి ఉన్న చిత్తూరు, నెల్లూరు జిల్లాలో వందల్లో కేసులు నమోదవుతూ భయం పట్టిస్తున్నాయి. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పోలింగ్ ఏర్పాట్లు చేసినా.. ప్రజల్లో నెలకొన్న భయం వెనక్కి నెడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Show comments