అప్పుడు తండ్రి.. ఇప్పుడు కూతురు.. పాపం విజయ్ ఆంటోనీ

కోలీవుడ్ ప్రముఖ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనిని విధి వెంటాడుతుంది. పిచ్చైకారన్ -2 (బిచ్చగాడు-2) షూటింగ్ సమయంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదపు అంచుల వరకు వెళ్లి బయటకు వచ్చారు. ఆ సమయంలో తామెంతో టెన్షన్ పడ్డామని బిచ్చగాడు-2 విడుదల సందర్భంగా ఆనాటి సంఘటనను తలుచుకుని ఎమోషనల్ అయ్యారు విజయ్ భార్య ఫాతిమా. ఆ తర్వాత విజయ్ కోలుకుని షూటింగ్ కూడా పూర్తి చేశారు. సినిమా విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది. అంతా బాగుంది అనుకునే సమయంలో విజయ్ కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకుందన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. మంగళవారం తెల్లవారు జామున 3 గంటలకు చెన్నైలోని డీడీకే రోడ్ లోని తమ నివాసంలో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ.. మీరా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మీరా చనిపోవడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. డిప్రెషన్ వల్ల అని, చదువుల ఒత్తిడి వల్ల అని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, తమిళనాడు పరిశ్రమలోని ప్రముఖులు విజయ్‌కు సానుభూతిని తెలియజేస్తున్నారు. అయితే, విజయ్ కూతురే కాదూ.. తండ్రి కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం గమనార్హం. గతంలో ఆ విషయాన్ని విజయ్ ఓ  ఈవెంట్ సందర్భంగా బయటపెట్టారు. తనకు ఏడేళ్లు ఉన్నప్పుడు తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని, అప్పుడు అమ్మ తనను, తన చెల్లెల్ని ఎంతో కష్టపడి పెంచారని, ఆ బాధ తనకు తెలుసునంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా సూసైడ్ మాత్రం చేసుకోవద్దు అంటూ సూచించారు. అలాగే చదువుల విషయంలో పిల్లలపై ఒత్తిడి తీసుకురాకూడదని, ఫ్రీగా వదిలేయాలని చెప్పారు. లేకుంటే వారికి సూసైడ్ థాట్స్ వస్తాయంటూ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు విజయ్ ఆంటోనీ కుమార్తె మీరాను బలవన్మరణానికి పాల్పడటంతో అతడి పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు తండ్రి, ఇప్పుడు కుమార్తె ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో.. దేవుడు ఇలాంటి మంచి మనస్సుల పట్ల ఎందుకింత నిర్ధయగా ఉన్నాడని పోస్టులు చేస్తున్నారు. మీరు ధైర్యంగా ఉండాలని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Show comments