Idream media
Idream media
తెలంగాణలో ఎన్నిక ఏదైనా పోటీ రసవత్తరంగా మారింది. బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడంతో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎటు మొగ్గుచూపుతారో అన్న ఉత్కంఠ ఏర్పడింది. ఈ ఉత్కంఠే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కూడా కనిపించింది. స్థానిక కోటాలో పన్నెండు స్థానాలకు ఆరుగురు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఆరు స్థానాలకు ఈ నెల 10న ఎన్నికలు జరిగాయి. మెజార్టీ శాసనసభ్యులు అధికార పార్టీకి చెందిన వారే ఉన్నప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ కూడా కొన్ని చోట్ల పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఆరు చోట్ల ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ప్రధానంగా కరీంనగర్ జిల్లాపైనే అందరి దృష్టీ పడింది. హుజూరాబాద్ లో గెలిచి టీఆర్ ఎస్ సర్కారు కు సవాలు విసిరిన ఈటల రాజేందర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అధికార పార్టీకి షాక్ ఇచ్చేందుకు మంత్రాంగం నడుపుతున్నారని వార్తలు రావడమే ఇందుకు కారణం. అయితే, ఈ రోజు వెలువడిన ఫలితాలను చూస్తే ఈటల మంత్రాంగం పనిచేయలేదని స్పష్టమవుతోంది.
కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు గాను మొత్తం పది మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. వారిలో టీఆర్ ఎస్ నుంచి ఎల్. రమణ, భాను ప్రసాద్ రావు ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా రవీంద్ర సింగ్, ఎంపీటీసీల రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచారు. వీరిలో రవీంద్ర సింగ్ టీఆర్ ఎస్ రెబల్ గాను, స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారన్న ప్రచారంతో ప్రభాకర్ రెడ్డి పోటీలో నిలిచారు. మొత్తం 1324 ఓట్లకు గాను, 1320 ఓట్లు పోలయ్యాయి. అంటే.. 99.70 శాతం ఓటింగ్ నమోదు కావడం కూడా ఉత్కంఠను రేపింది.
సర్దార్ రవీందర్ సింగ్ కు ఈటల రాజేందర్ బాహాటంగా మద్దతు తెలపడంతో ఎమ్మెల్సీ ఎన్నికలపై అంచనాలు పెరిగిపోయాయి. ఆయన గెలుపు కోసం ఈటల రంగంలోకి దిగారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు పోగా.. బరిలో ఉన్న మిగతా ఎనిమిది మంది ఇండిపెండెంట్లతో మాట్లాడి ఉమ్మడి అభ్యర్థిగా రవీందర్ ను ఎంచుకునేలా కూడా ఈటల ప్రయత్నించినట్లు తెలిసింది.
ముఖ్యంగా మంథని హుజూరాబాద్ పెద్దపల్లి ప్రాంతాల్లో ఉన్న ఓట్లపై ఈటల దృష్టి సారించారు. ఈటల రాజేందర్, మంథని ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఉమ్మడిగా ప్రయత్నించినట్లు తెలిసింది. హుజూరాబాద్ మంథని పెద్దపల్లిలో కలిపి మొత్తం 488 ఓట్లు ఉన్నాయి. వాటిని చీల్చి రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ గెలుపు కోసం ఈటల వ్యూహాలు రచించారు. హుజూరాబాద్లో 181 మంథనిలో 98 పెద్దపల్లిలో ఏకంగా 209 మంది స్థానిక ప్రజా ప్రతినిధులున్నారు. ఈ ఓట్లలో అధికం అధికార పార్టీకి పడకుండా ఈటల కసరత్తు చేశారని, కానీ ఎత్తుగడలు ఫలించలేదని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ఈటల ప్రయత్నాలతో అధికార పార్టీ కూడా అప్రమత్తమైంది. తమ స్థానిక సంస్థల ప్రతినిధులను విహార యాత్రల పేరుతో వేర్వేరు ప్రదేశాల్లో క్యాంపులకు తరలించింది. పోలింగ్ కేంద్రాలకే నేరుగా వారిని తీసుకొచ్చింది. అక్కడక్కడ అసంతృప్తులు ఉన్నప్పటికీ అందరినీ కలుపుకుపోవడంలో టీఆర్ ఎస్ విజయం సాధించింది. ఎల్. రమణ, భాను ప్రసాద్ రావు లు మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందారు. ఈటల మద్దతు తెలిపిన రవీంద్ర సింగ్ కేవలం 231 ఓట్లు మాత్రమే సాధించారు. ఇక్కడ ఈటలకు కాంగ్రెస్ నేతలు కూడా సహకరించినా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడం గమనార్హం.