ఏవండీ రంగారావు గారు – Nostalgia

ఏవండీ రంగారావు గారు ,

మీ మట్టుకు మీరు అప్పుడెప్పుడో నేను పుట్టక పదేళ్ల ముందు ఈ లోకం నుంచి సెలవు తీసుకుని బర్కిలీ సిగరెట్టుతో గుప్పుగుప్పుమని పొగలు ఊదుతూ స్వర్గానికి వెళ్లిపోయారు. హాయిగా రెస్టు తీసుకుంటున్నారు. ఇంద్రుడి సమక్షంలో మీకు సకల గౌరవాలు, రాజభోగాలు అందుతున్నాయని మాకు వేరే చెప్పాలా. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఓ రెండు ముక్కలు మీతో చెప్పుకుందామని ఇదంతా రాస్తున్నాను.

నిక్కర్లు వేసుకుని స్కూల్కెళ్లే వయసులో నలుపు తెలుపు టీవీలో మాయాబజార్ వీడియో క్యాసెట్ చూస్తూ ఘటోత్ఘచుడి రూపంలో నిండైన విగ్రహంతో మీరు చెప్పిన డైలాగులు అర్థం కాకపోయినా ఎన్ని రోజులు గుర్తుండిపోయాయో. పాతళభైరవి సినిమాలో సాహసం సేయరా డింభకా మాట వెనకాల ఎంత ఇన్స్ పిరేషన్ ఉందో ఇంటర్ మీడియట్ కు వచ్చాక కానీ అర్థం కాలేదు మరి. తాతా మనవడు చూస్తూ మా నానమ్మ చీర కొంగుతో పదే పదే కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటే దానికి కారణం మీరేగా. మా వీధి మొత్తం గుడ్లప్పగించి చూసిన నర్తనశాలలో మీ నటనాకౌశలం గురించి చెప్పడమంటే సముద్రంలో బియ్యపు గింజ వేసి దాని కోసం వెతుక్కోవడమేగా.

గొల్లపూడి సన్స్ వారి బాలల బొమ్మల పుస్తకంలో భక్త ప్రహ్లాద కథ చదువుతున్నప్పుడు హిరణ్యకశిపుడు అంటే మీ దివ్యమంగళస్వరూపమే తప్ప మరొకరు గుర్తుకువస్తే ఒట్టు. గుండమ్మ కథలో మిమ్మల్ని చూసినప్పుడు నువ్వెందుకు ఇలా ఉండవు నాన్నా అని ఆయనవైపు ఎన్నిసార్లు చూసి ఉంటానో. తండ్రి, తాతయ్య, మావయ్య, బావ, పెద్దన్నయ్య ఇలా కుటుంబంలోని అన్ని వరసలు మీరే చేస్తిరి. యాక్టింగ్ డిక్షనరీ అనేది రాస్తే అందులో మొదటి పేజీ మీదే అన్నంత బలంగా ప్రభావం చూపించిన మిమ్మల్ని నేరుగా వెండితెరపై చూసి తరించిన అప్పటి తరం ప్రేక్షకులు, సినిమా ప్రేమికులు ఎంతటి అదృష్టవంతులో. ఒకటా రెండా చేతి వేళ్ళు నొప్పి పుడతాయని ఆగుతున్నా కానీ లేదంటే చెప్పుకుంటూ పోతే ఎన్ని వేల ముచ్చట్లో. ఆగాలని లేకపోయినా తప్పక ఆపేస్తున్నా.

మీరోపాలి అర్జెంట్ గా వచ్చేయాలి రంగారావుగారు. ఇక్కడ కరువొచ్చి పడింది. నటులు దొరక్క అద్దెకు బొంబాయి నుంచి దిగుమతి చేసుకుని తెలుగు డైలాగులు కూడా ఇంగ్లీష్ లో రాసిచ్చి చెప్పించుకునే ఖర్మ పట్టింది. స్వంతంగా డబ్బింగు చెప్పుకోలేని బాలీవుడ్ డంప్ యార్డ్ బ్యాచ్ మొత్తం మా వందల కోట్ల సినిమాల్లో విలన్లుగా తిష్టవేసుకుని కూర్చున్నారు. మీరొకసారి వచ్చి క్లాసులు పీకండి. నటనంటే ఏమిటో రెండు శాంపిల్ ముక్కలు వదలండి. మెరికల్లాంటి ఆణిముత్యాలు తెలుగు సీమలోనే ఉన్నారని చెవులు పిండి మా దర్శకులకు చెప్పండి. ఏదో చిన్న వయసు అర్భకుణ్ణి. మీ పుట్టినరోజని ఆవేశపడి ఏదేదో చెప్పేశా. లేదూ వాగేశా అనుకుంటే క్షమించండి.

మీకేం ఎన్టీఆర్,ఏఎన్ఆర్, సావిత్రి, గుమ్మడి, రాజనాల, కాంతారావు, రావు గోపాల రావు లాంటి ఉద్దండులతో బ్రహ్మాండమైన కాలక్షేపం చేస్తుంటారు. ఇక్కడ మేమేమో థియేటర్లు మూతబడి ఓటిటి అనే అంటురోగం తెచ్చుకుని ఆరించుల స్మార్ట్ ఫోన్లలో మా దృష్టి లోపాలను శాయశక్తులా పెంచుకుంటున్నాం. కాస్త దయతలచి నేను చెప్పిన విన్నపంతో పాటు మరొక్క విజ్ఞప్తిని ఆలకించగలరు. పక్కనే ఉన్న నరకంలో యమధర్మరాజు గారు ఉంటారు. కాస్త ఎవరినైనా అక్కడికి పంపించి కరోనా మహమ్మారికి బ్రేక్ వేయమని చెప్పండి.ఇప్పటికే చాలా ప్రాణాలు పోయాయి. టాపిక్ డైవర్ట్ అవుతోంది. ఇక ఉంటానండి రంగారావు గారు. సెలవు మరి. ఇవాళ అక్కడ గ్రాండ్ సెలెబ్రేషనటగా. నేను ఇది టైప్ చేస్తున్నప్పుడు రమణారెడ్డి గారు, రేలంగి గారు మెసేజ్ పంపారు. అంతేలేండి ఎక్కడున్నా మీది రాజభోగమే. స్వర్గమైనా ప్రేక్షకుల హృదయమైనా.

సెలవు
ఇట్లు
మీరున్న తరాన్ని మిస్సయిన ఓ సినీమాని

Show comments