iDreamPost
iDreamPost
సూపర్ స్టార్ కృష్ణ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు ఇందాక తీవ్ర అస్వస్థతతో కన్ను మూశారు. గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో చికిత్స తీసుకుంటున్న ఆయన పరిస్థితి ఇవాళ ఊహించని విధంగా విషమంగా మారింది. గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో చివరి శ్వాస తీసుకున్నారు. అక్కడికి చేరుకునేలోపే ప్రాణం పోయిందని డాక్టర్లు నిర్ధారణ చేశారు. ఇప్పుడంటే పరిశ్రమకు దూరంగా ఉన్నారు కానీ ఒకప్పుడు కృష్ణ వారసుడిగా మహేష్ కంటే ముందు చక్రం తిప్పింది రమేషే. అప్పట్లో సామ్రాట్ (1987) చిత్రంతో తెరంగేట్రం చేసినప్పుడు దానికి వచ్చిన ఓపెనింగ్స్ ట్రేడ్ ని నివ్వెరపరిచాయి. భారీ కలెక్షన్లతో డెబ్యూతోనే కలెక్షన్ల రికార్డులు సాధించడం మీడియాలో చాలా కథనాలు వచ్చాయి
చైల్డ్ ఆర్టిస్ట్ గా రమేష్ బాబు మొదటిసారి తెరమీద కనిపించింది అల్లూరి సీతారామరాజులో. యువకుడిగా దాసరినారాయణరావు నీడతో పరిశ్రమకు పరిచయమైన రమేష్ బాబుకి అప్పట్లో మంచి అందగాడిగా పేరుండేది. నాన్న కృష్ణ, తమ్ముడు మహేష్ తో కలిసి 80, 90 దశకాల్లో పలు చిత్రాల్లో నటించారు. ముగ్గురు కొడుకులు అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన సూపర్ హిట్ మూవీ. కృష్ణగారి అబ్బాయి టైటిల్ తో రూపొందిన సినిమాలో ఈయన డ్యూయల్ రోల్ చేయడం విశేషం.కొన్నేళ్ల పాటు హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన రమేష్ బాబు ఆ తర్వాత ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. సక్సెస్ లు దక్కకపోవడమే కారణం
ఒకదశలో వరస ఫ్లాపులు పలకరించడంతో యాక్టింగ్ కి స్వస్తి చెప్పి పద్మాలయా తాలూకు వ్యవహారాల్లో బిజీ అయ్యారు. తిరిగి కొన్నేళ్ల తర్వాత ఎన్ శంకర్ డైరెక్షన్ లో రూపొందిన ఎన్కౌంటర్ (1997) లో రమేష్ బాబు నాన్నతో కలిసి రీ ఎంట్రీ ఇచ్చారు. అది మంచి ఫలితాన్ని అందుకున్నప్పటికీ తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించలేదు. రమేష్ బాబు నిర్మాతగా 2004లో మహేష్ తో భారీ బడ్జెట్ తో నిర్మించిన అర్జున్ యావరేజ్ గా నిలవడంతో ఆశించిన లాభాలు రాలేదు. అతిథి, దూకుడు, ఆగడుల సమర్పకుడిగా వ్యవహరించారు. బజారు రౌడీ, కలియుగ అభిమన్యుడు, బ్లాక్ టైగర్, ఆయుధం, నా ఇల్లే నా స్వర్గం రమేష్ నటించిన సినిమాల్లో ముఖ్యమైనవి. అన్నయ్యతో ఎంతో అనుబంధం ఉన్న మహేష్ బాబుతో అభిమానులు ఇక రమేష్ లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోవడం కష్టం
Also Read : OTT Prices : భవిష్యత్తు OTTలో ఆ మార్పు తప్పదేమో