కరోనా అలజడి : క్వారంటైన్‌లోకి జనసేన అధినేత ‌

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న వేళ బీజేపీ–జనసేన కూటమిలో కరోనా అలజడి రేగింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత సహాయకులు, భద్రతా సిబ్బందిలో పలువురు కరోనా బారిన పడ్డారు. దీంతో వైద్యుల సూచనల మేరకు పవన్‌ కల్యాణ్‌ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఈ పరిణామాలు జనసేన శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆయన అభిమానుల్లోనూ కలవరం మొదలైంది.

పవన్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లడంతో.. ఇక తిరుపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం దాదాపు అసాధ్యమనే టాక్‌ వినిపిస్తోంది. పవన్‌ 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి. తాజా పరిణామంపై బీజేపీ ఆందోళన చెందుతోంది. ఇప్పటి వరకు జరిగిన ప్రచారం ఒకెత్తు అయితే.. చివరి నాలుగు రోజుల్లో జరిగే ప్రచారం మరో ఎత్తు. ఈ నెల 17వ తేదీన తిరుపతి ఉప ఎన్నికకు పోలింగ్‌ జరగబోతోంది. 15వ తేదీతో ప్రచారం ముగుస్తోంది. నాలుగు రోజుల్లోనే అన్ని పార్టీలు విస్తృత ప్రచారం చేసేందుకు ప్లాన్‌ చేసుకున్నాయి.

ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలోని బీజేపీ నేతలతోనే కమల దళం ప్రచారం నిర్వహించింది. రేపు సోమవారం నుంచి జాతీయ నేతలను ప్రచారంలోకి దింపుతోంది. చివరి నాలుగు రోజులు జాతీయ నేతలు తిరుపతి లోక్‌సభ పరిధిలో బహిరంగ సభలు, రోడ్‌ షోలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే రేపు నెల్లూరు జిల్లా గూడూరులో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్‌లు హాజరుకానున్నారు. వీరితోపాటు పవన్‌ కల్యాణ్‌ కూడా వస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.

అయితే ప్రస్తుతం పవన్‌ క్వారంటైన్‌లోకి వెళ్లడంతో ఆయన హాజరుపై సందేహాలు నెలకొన్నాయి. సభకు దాదాపుగా పవన్‌ హాజరుకాకపోవచ్చని చెబుతున్నారు. అయితే పరిస్థితిని బట్టీ పవన్‌ చేత ఆన్‌లైన్‌లో మాట్లాడించే ందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుపతిలో ఎన్నికల్లో చెప్పుకొదగిన ఓట్లు పొందేందుకు బీజేపీ నేతలు.. పవన్‌ కల్యాన్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఆ పార్టీ అభ్యర్థి రత్న ప్రభ కూడా.. తమ్ముడు వచ్చాడు.. నన్ను గెలిపిస్తాడంటూ ఇటీవల తిరుపతిలో జరిగిన బహిరంగసభలో చెప్పారు.

Also Read : మళ్లీ గ్లాసు మీద మనసుపడ్డావా బాబు!

Show comments