Idream media
Idream media
40 ఏళ్ల క్రితం శంకరాభరణం మొదటి ఆటను చూసిన వాళ్లలో నేనూ ఒకడిని. అనంతపురం శాంతి టాకీస్‌లో ఉదయం 11.30 గంటలకు వెళ్లాను. మనసులో ఎక్కడో అనుమానం ఉంది. విశ్వనాథ్ సినిమాలంటే బాగా ఇష్టమే అయినప్పటికీ, అంతకు మునుపు కాలాంతకులు అనే ఘోరమైన సినిమా కూడా ఆయన తీసినదే. ఆ అనుభవం వల్ల కొంచెం భయంభయంగా థియేటర్‌లోకి వెళ్లాను. ఫ్రెండ్స్‌ని ఎవరిని పిలిచినా ఒక్కరు కూడా రాలేదు. పైగా నవ్వారు. శంకరాభరణమా ఎవరు హీరో అన్నారు. నాకు జేవీ సోమయాజులు పేరు కూడా తెలియదు. విశ్వనాథ్ సినిమా బాగుంటుంది అని చెబితే , మాకు వద్దురా బాబు ఇదేదో సుత్తి సినిమాలా ఉంది అన్నారు.
రూపాయి పది పైసల క్లాస్ టికెట్ అంటే దీని తర్వాత రూ.1.50పైసలు , రూ.2, రూ.2.30 పైసలు టికెట్ ఉంటాయి. నా కింది క్లాస్ 75 పైసలు. ఆ క్లాస్‌లో ఇద్దరు కూడా లేరు.
నా క్లాస్‌లో ఓ పది మంది, నా పై క్లాస్‌లన్నీ కలిపి ఓ 20 మంది ఉన్నారు. మిగతా హాలు ఖాళీ. సినిమా స్టార్ట్ అయ్యింది. ఆ వయస్సులో నాకు సంగీత జ్ఞానం లేకపోయినా (ఇప్పటికీ లేదు) ఏదో మెస్మరిజం ఆ సినిమాలో ఉన్నట్టు అనిపించింది. ఏదో బాధ, ఎమోషన్, శంకర్‌శాస్త్రిని చూస్తే జాలి. ఇంటిర్వెల్‌లో ఏమీ కొనుక్కోవాలనిపించలేదు.
సినిమా అయిపోయే సరికి కన్నీళ్లు. భారంగా వచ్చాను. మ్యాట్నీకి కూడా అంతే. గట్టిగా 30 మంది లేరు. కనిపించిన వాళ్లందరికీ చెప్పాను సినిమా బాగుందని. ఎవరూ నమ్మలేదు. రేడియోలో పాటలు వచ్చి, బయట కూల్‌డ్రింక్ షాప్‌లో పాటలు వినిపిస్తూ ఉంటే జనాలకి ఎక్కింది.
రెండు రోజుల తర్వాత మళ్లీ వెళితే హాలు సగానికి పైగా నిండింది. తర్వాత ఎప్పుడు వెళ్లినా హౌస్‌ఫుల్లే. శంకరాభరణం మంచి సినిమా అని ఫస్ట్ డేనే గుర్తు పట్టినందుకు నన్ను నేను అభినందించుకుంటూ , ఆ తర్వాత సినిమాలు చూడ్డమే పనిగా పెట్టుకుని డిగ్రీలో దండయాత్ర చేశాను.
ఫైటింగ్ సినిమాలు చూసి విజిళ్లు వేసే వయస్సులో కూడా శంకరాభరణం నాకు ఎందుకు నచ్చిందా అని ఆలోచిస్తే …
1.శంకరశాస్త్రి వ్యక్తిత్వం
2.తన పాటని డిస్టబ్ చేస్తే ఎవరినైనా ధిక్కరించే అహంకారం.
3.ఆచార వ్యవహారాల కంటే మంచితనాన్ని నమ్మే సంస్కారం
4.పెళ్లి చూపుల్లోనైనా సరే తప్పు పాడితే కూతురినైనా సహించలేని సంగీత ఆరాధన
5.తాను కష్టాల్లో ఉండి కూడా మృదంగ కళాకారుడు సాక్షి రంగారావుకి సాయం చేసే గుణం
అంత చిన్నతనంలో కూడా శంకరశాస్త్రి నచ్చాడు అంటే ఇవే కారణాలు. విషాదం ఏమంటే జేవీ సోమయాజులుకి మళ్లీ ఏ సినిమాలోనూ ఇంత పేరు రాలేదు. అదేదో సినిమాలో స్త్రీ లోలుడిగా వేసి చెడ్డపేరు కూడా తెచ్చుకున్నాడు. వ్యాంప్ క్యారెక్టర్స్ వేసి , సగం బట్టలతో డ్యాన్స్ చేసే మంజుభార్గవికి ఈ పాత్ర ఒక వరం. తర్వాత ఆమె ఒకట్రెండు సినిమాలకి మించి చేయలేదు. రాజ్యలక్ష్మి, తులసి హీరోయిన్‌గా నిలదొక్కుకోలేక , ఇప్పుడు తల్లి పాత్రల్లో సెటిల్ అయ్యారు. చంద్రమోహన్‌కి ఈ సినిమాలో కొత్తగా వచ్చిన పేరు లేదు.
కే. విశ్వనాథ్ తర్వాత కూడా చాలా సినిమాలు తీశారు. ఇంత పెద్ద హిట్ ఏదీ లేదు. సిరిమువ్వల సింహనాదం అనే సినిమా విడుదలకు నోచుకోకపోవడం ఆయన కెరీర్‌లో ఒక మైనస్. దీన్నే కాలమహిమ అంటారు.