Idream media
Idream media
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు వాగులో పడిన ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంత మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.
జంగారెడ్డి గూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. వేలేరుపాడు నుంచి జంగారెడ్డి గూడెంకు వస్తోంది. 50 మంది ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సు.. జంగారెడ్డి గూడెం మండలం జల్లేరు వాగులో బోల్తా పడింది. బస్సు వేగంగా రావడంతో అదుపుతప్పి బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. 20 అడుగుల ఎత్తు నుంచి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. డ్రైవర్‌తోపాటు మరో 8 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం.
బస్సు డోరు వైపు వాగులో ఉండడంతో.. స్థానికులు బస్సు కిటికీ అద్దాలను పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. పడవల ద్వారా వారిని ఒడ్డుకు చేర్చారు. గాయపడిన వారిని జంగారెడ్డి గూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఆర్‌డీవో, డీఎస్పీ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరి సహాయక చర్యలు చేపట్టారు.
Also Read : ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరో విషాదం
సీఎం జగన్ దిగ్భ్రాంతి..
ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.