iDreamPost
iDreamPost
రాజమౌళి క్రేజీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ విడుదల ముందు ప్రకటించినట్టుగా ఈ ఏడాది జులై 30న ఉండే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఫిలిం నగర్ టాక్ ప్రకారం షూటింగ్ ఇంకా చాలా బాలన్స్ ఉందని, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎంత లేదన్నా అయిదారు నెలలు అవసరమని అలాంటప్పుడు జులై డెడ్ లైన్ మీట్ కావడం అసాధ్యమని తేల్చి చెబుతున్నారు. దసరాకు అనుకున్నప్పటికీ ఇలాంటి విజువల్ వండర్ కి అది సరైన టైం కాదు. అందుకే జక్కన్న టీమ్ 2021 సంక్రాంతి మీద కన్నేసిందనే వార్త ఇప్పుడు చాలా మంది నిర్మాతలకు టెన్షన్ పుట్టిస్తోంది. కారణం లేకపోలేదు.
తెలుగునాట సంక్రాంతి బాక్స్ ఆఫీస్ స్టామినా ప్రతి సంవత్సరం అంతకంతా పెరుగుతూ పోతోంది. రూపాయి రావాల్సిన సినిమాకు ఏకంగా రెండు నుంచి మూడు రూపాయల రిటర్న్స్ వస్తున్నాయి. యావరేజ్ ఉన్నా చాలు స్టార్ హీరోలు వంద కోట్లు కొల్లగొట్టడం ఖాయమని అర్థమైపోయింది. ఇప్పటి నుంచే దానికి తగ్గట్టు తమ సినిమాలు ప్లానింగ్ చేసే పనిలో పడ్డారు. ఇప్పుడు నిర్మాత దానయ్య కనక వచ్చే సంక్రాంతి అని డిసైడ్ అయితే ఆర్ఆర్ఆర్ తో పోటీ పడటం ఎంత పెద్ద స్టార్ కైనా అంత ఈజీ కాదు. రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం కాంబినేషన్ కాబట్టి బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది.
ఒకవేళ ధైర్యం చేసి పోటీ పడ్డా ప్రేక్షకులతో పాటు బయ్యర్ల మొదటి ఛాయస్ ఆర్ఆర్ఆర్ అవుతుందే తప్ప ఇంకో సినిమా వైపు అంతగా ఆసక్తి చూపరు. వాళ్ళ సంగతేమో కాని ఇతర ప్రొడ్యూసర్లు కూడా ధైర్యంగా అడుగు వేయలేరు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన కీలక ప్రకటన కోసం చరణ్ తారక్ ఫ్యాన్స్ కన్నా ఇతర హీరోలు నిర్మాతలు ఎదురు చూస్తున్న మాట వాస్తవం. ఒకవేళ అదే జరిగితే కోలీవుడ్ శాండల్ వుడ్ తో సహా అన్ని వుడ్ ల ప్లానింగులు మార్చుకోవాల్సి వస్తుంది. రాజమౌళి బ్రాండ్ అలాంటిది. అయితే ఇప్పటికిప్పుడు ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.