అలాంటి ఓటిటి సాధ్యమేనా

ఇటీవలే తమిళ సినిమా నిర్మాతల సమాఖ్య ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదారేళ్ళలో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల చేసుకోలేక ఆగిపోయిన చిత్రాల వివరాలు ఇవ్వాలని అందరికీ సమాచారం పంపింది. దానికి కారణం కోలీవుడ్ కు స్వంతంగా ఒక ఓటిటి పెట్టుకునే ఆలోచన. ఇదేదో బాగానే ఉందని ల్యాబుల్లో మగ్గిపోతున్న సినిమాల డీటెయిల్స్ ఒక్కొక్కరుగా పంపడం మొదలుపెట్టారు. సరే వినడానికి ఓకే కానీ ప్రాక్టికల్ గా ఇదెంత వరకు వర్కౌట్ అవుతుందనే దాని మీద అనుమానాలు లేకపోలేదు. తెలుగులోనూ ఇలాంటివి చేస్తే బాగుంటుంది కదాని అంటున్న వారు లేకపోలేదు. ఇక్కడ కొన్ని అంశాలు గమనించాలి.

రిలీజ్ ఆగిపోయిన సినిమాల్లో దాదాపు స్టార్లు ఉండరు. ఒకవేళ ఉంటే డిస్ట్రిబ్యూటర్ల సహాయంతో ఎలాగోలా బయటికి తీసుకురావచ్చు. చిన్న ఆర్టిస్టులు మీడియం రేంజ్ హీరోలతోనే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏవైనా చిక్కులు ఉంటే వీటిని అంత ఈజీగా ఎవరూ కొనరు. ఒకవేళ ఇప్పుడు నిర్మాతల తరఫున ఓటిటి పెట్టేసి రిలీజ్ బ్రేకులు పడిన సినిమాలన్నీ అందులో వేసినా కూడా పెద్దగా ఉపయోగం ఉంటుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ కంటెంట్ ముఖ్యం. కొత్తది కదాని ఏది పడితే అది చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా లేరు. వాళ్ళు క్వాలిటీని డిమాండ్ చేస్తున్నారు.

గత ఏడాది చిన్న సినిమాలు విపరీతంగా తీసే ఒక తెలుగు నిర్మాత ఇదే మోడల్ ని అలోచించి ఓ ఓటిటి పెట్టారు. నా యాప్ లో రిలీజ్ చేయండి వచ్చిన రెవిన్యూ పంచుకుందామని ప్రతిపాదన పెట్టారు. కొన్ని సినిమాలు ఇరవై ముప్పై రూపాయలు పే పర్ వ్యూ కూడా అమలు పరిచారు. కానీ ఇది దారుణంగా దెబ్బ తింది. మరీ నాసిరకం చిన్న సినిమాలు అప్లోడ్ చేయడంతో కనీస స్పందన దక్కలేదు. దెబ్బకు మూడు నెలలు తిరగకుండానే అది మూతబడింది. ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా ఇలాగే చేతులు కాల్చుకున్నారు. సో కోలీవుడ్ లో ఇలా చేస్తున్నంత మాత్రాన అది ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుందని చెప్పడానికి లేదు

Show comments