Railway to drop ‘special train’ tag – స్పెషల్‌ దోపిడీకి రెడ్‌ సిగ్నల్‌

రైల్వేశాఖ చేపట్టిన ‘స్పెషల్‌’ దోపిడీకి ఎట్టకేలకు రెడ్‌ సిగ్నల్‌ పడింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి అయితేనేమి… ప్రయాణీలకు నుంచి వస్తున్న తీవ్ర వత్తిడి వల్ల అయితేనేమి రైల్వేశాఖ స్పెషల్‌ దోపీడి నుంచి ప్రయాణీకులకు ఉపశమనం కలిగించింది. సాధారణ సర్వీసులను స్పెషల్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు రైల్వేశాఖ చేసిన ప్రకటన ప్రయాణీకులు ఊరట కలిగించనుంది.

భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు నడపడం కొత్తకాదు. గతంలో దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగలు, శబరిమల వంటి యాత్రలు, సాధారణ ఎన్నికలు వంటి సందర్భాలలో సాధారణ సర్వీసులతోపాటు స్పెషల్‌ రైళ్లు నడిపేది. సాధారణ రైలు టిక్కెట్‌ ధరలతో పోలిస్తే స్పెషల్‌ సర్వీస్‌ టిక్కెట్‌ ధర అధికం. గత ఏడాది కోవిడ్‌ నేపథ్యంలో కేంద్రం లాక్‌డౌన్‌ విధించింది. ఈ సమయంలో రైల్వే సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ విడతల వారీగా ఎత్తివేసిన తరువాత నుంచి రైల్వే సర్వీసులు మొదలయ్యాయి. తొలి రోజుల్లో కొన్ని కీలకమైన సర్వీసులను మాత్రమే భారతీయ రైల్వే నడిపింది. తరువాత నుంచి సర్వీసులను పెంచుకుంటూ వస్తోంది. ప్రస్తుతం రైల్వే పూర్తిస్థాయిలో ప్రయాణీకుల సర్వీసులు నడుపుతుంది.

అయితే కోవిడ్‌ లాక్‌డౌన్‌ తరువాత నుంచి మొదలైన రైల్వే సర్వీసులకు ‘ప్రత్యేకం’ పేరు పెట్టి టికెట్‌ బేసిక్‌ ఫెయిర్‌ పెంచింది. అన్నిరకాల ఎక్స్‌ప్రెస్‌, మెయిల్‌ సర్వీసుల నెంబర్ల ముందు సున్నా జోడించి ప్రయాణీకుల నుంచి కోట్ల రూపాయిలు అదనంగా కొల్లగొట్టింది. రైలు టిక్కెట్‌ బేసిక్‌ మీద 20 శాతం నుంచి 25 శాతం వరకు ధర పెరిగింది. సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ స్పెషల్‌ ట్రైన్స్‌లు తొలగించలేదు. రోజువారీ సర్వీసులకు సైతం స్పెషల్‌గానే పరిగణించి ధరలు వసూలు చేశారు. స్పెషల్‌ బాధుడు పేరుతో రైల్వేశాఖ కోవిడ్‌ సమయంలో వచ్చిన నష్టాల నుంచి గట్టెక్కాలని భావించింది.

రాష్ట్రంలో కీలకమైన గౌతమి, గోదావరి, నర్సపూర్‌, కోకోనాడ్‌ ఏసీ, సర్కార్‌, శేషాద్రి, జన్మభూమి, వెంకటాద్రి, చార్మినార్‌, ఏపీ, తెలంగాణా వంటి సర్వీసులన్నీ ‘ప్రత్యేకం’ పేరుతోనే నడిచాయి. ప్రత్యేకం వల్ల ప్రయాణీకులపై అధికభారం పడింది. ఉదాహరణకు కాకినాడ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లేందుకు అయ్యే స్లీపర్‌ టిక్కెట్‌ మీద రూ.80, త్రీ టైర్‌ ఏసీ టిక్కెట్‌ మీద రూ.210, టూ టైర్‌ మీద రూ.299, ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ టిక్కెట్‌ మీద రూ.468 వరకు అదనపు భారం పడింది. విజయవాడ నుంచి సికింద్రాబాద్‌ వరకు స్లీపర్‌ మీద రూ.40, త్రీ టైర్‌ రూ.90, టూ టైర్‌ రూ.140, ఫస్ట్‌క్లాస్‌ మీద రూ.260 వరకు అదనపుభారం పడింది.

ప్రయాణీకుల నుంచి తీవ్ర విమర్శలు రావడం, ఉప ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలతో కేంద్రం దిగి వచ్చింది. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కొంత వరకు తగ్గించిన కేంద్రం రైల్వే టిక్కెట్‌ ధరలు తగ్గేలా చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా రెగ్యులర్‌ సర్వీసులను ప్రత్యేకం కోటా నుంచి తొలగిస్తున్నామని, వెంటనే ఇది అమలులోకి వస్తుందని రైల్వే శాఖ ప్రకటించడంతో ప్రయాణీకులకు కొంత ఊరట లభించింది.

Also Read :  Kakinada,Kotipalli – రైల్‌ బస్సు ప్రయాణం మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో..?

Show comments