Idream media
Idream media
ఈ ఆదివారం మెల్బోర్న్ లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్లో ఆరవ సీడ్ రాఫేల్ నాడాల్ తన కన్నా చిన్నవాడు, మంచి ఫామ్ లో ఉన్న రెండవ సీడ్ రష్యా క్రీడాకారుడు డానిల్ మెద్వెదేవ్ మీద 5 గంటలా 24 నిమిషాలు జరిగిన అయిదు సెట్ల మ్యాచ్ లో గెలిచి, 21 వ గ్రాండ్ స్లామ్ గెలిచిన మొదటి క్రీడాకారుడిగా ప్రపంచరికార్డు సాధించాడు. ఆ వేదిక మీద నాడాల్ సాధించిన రెండో టైటిల్ ఇది. అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన రికార్డు గత కొద్ది మాసాలుగా రోజర్ ఫెదరర్, నోవాక్ జోకోవిచ్, రాఫేల్ నాడాల్ ల పేరిట సంయుక్తంగా ఉండేది. ముగ్గురు ఇరవై టైటిల్స్ గెలిచి ఉన్నారు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఓపెన్ లో తొమ్మిది సార్లు టైటిల్ సాధించిన జోకోవిచ్ ఈసారి కూడా గెలిచి మిగతా ఇద్దరినీ దాటి ముందుకు పోతాడు అని టెన్నిస్ అభిమానులు భావించినా, కరోనా వాక్సిన్ వేసుకోకపోవడం వలన ఆస్ట్రేలియా అధికారులు అతన్ని విమానాశ్రయంలోనే నిలిపివేశారు. దాంతో కొత్త రికార్డు నెలకొల్పే అవకాశం నాడాల్ కి దక్కింది.
ఈ జూన్ లో జరగబోయే ఫ్రెంచ్ ఓపెన్ లో తిరుగులేని రికార్డు ఉన్న నాడాల్ అక్కడ కూడా గెలిచి తన రికార్డును మెరుగుపరిచినా, ఆ తర్వాత వింబుల్డన్, యూఎస్ ఓపెన్ లలో జోకోవిచ్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. వయసు మీద పడటంతో బాటు మోకాలి గాయాలు, ఆపరేషన్లతో ఫెడరర్ తన దృష్టిని వింబుల్డన్ మీదనే కేంద్రీకరించడంతో, అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన రికార్డు మరికొన్ని రోజులు నాడాల్, జొకోవిచ్ ల మధ్య దోబూచులాడటం ఖాయమని నిపుణులు, అభిమానులు భావిస్తున్నారు.
2001లో ప్రారంభమైన తన అద్భుతమైన కెరీర్ లో రాఫేల్ నాడాల్ తన ఆటతీరుతో టెన్నిస్ క్రీడలో ఎన్నో గొప్ప రికార్డులు స్థాపించాడు.
ఫ్రెంచ్ ఓపెన్ లో తిరుగులేని రికార్డు
మట్టి కోర్టుల మీద జరిగే ఫ్రెంచ్ ఓపెన్ కి తగ్గట్టుగా ఉండే బేస్ లైన్ గేమ్ లో నిష్ణాతుడైన నాడాల్ కి ఆ టోర్నమెంట్ లో అనితరసాధ్యమైన రికార్డు ఉంది. 2005 లో పంతొమ్మిది సంవత్సరాల వయసులో మొదటి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న నాడాల్, వరుసగా నాలుగు సార్లు ఈ టైటిల్ గెలిచాడు. తన మొదటి పది ప్రయత్నాల్లో తొమ్మిది సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచాడు. 2017లో తన పదో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గే క్రమంలో ఆ టోర్నమెంట్ మొత్తం మీద కేవలం 35 గేములే కోల్పోయారు. ఆ తర్వాత మరో మూడు టైటిల్స్ గెలిచి, ఒక గ్రాండ్ స్లామ్ అత్యధికంగా 13 సార్లు గెలిచి ప్రపంచ రికార్డు సృష్టించాడు. పురుషుల విభాగంలో అతని తర్వాత స్థానాల్లో తొమ్మిది ఆస్ట్రేలియా టైటిల్స్ గెలిచిన జోకోవిచ్ రెండవ స్థానంలో, ఎనిమిది వింబుల్డన్ టైటిల్స్ తో ఫెడరర్ మూడో స్థానంలో ఉన్నారు.. మహిళా క్రీడాకారులను కూడా కలుపుకుంటే నాడాల్ తర్వాత స్థానంలో పదకొండు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్స్ నెగ్గిన ఆస్ట్రేలియా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ ఉంది. ఫ్రైంచ్ ఓపెన్ లో నాడాల్ ఆడిన మ్యాచ్ లలో 105 గెలిచి, మూడు మాత్రమే ఓడిపోయి 97.2% విజయంతో ఎవరికీ అందని మరో ప్రపంచ రికార్డు స్థాపించాడు.
2008,2010 2017,2020 సంవత్సరాలలో నాలుగు సార్లు ఒక సెట్ కూడా కోల్పోకుండా ఫ్రైంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గడం కూడా నాడాల్ ఖాతాలో ఉన్న మరో ప్రపంచ రికార్డు.
Also Read : ఆల్ టైమ్ గ్రేట్ ఆటగాడి ఆర్డినరీ ఆరంగేట్రం
ఇతర గ్రాండ్ స్లామ్ పోటీల్లో నాడాల్ రికార్డులు
నాలుగు గ్రాండ్ స్లామ్ పోటీల్లో ఒకో దానిలో కనీసం రెండు, అంతకన్నా ఎక్కువసార్లు గెలిచి జోకోవిచ్ రికార్డును సమం చేశాడు ఈ సంవత్సరం సాధించిన ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ తో. ఆతి చిన్న వయసులో నాలుగు టైటిల్స్ గెలిచి, కెరీర్ గ్రాండ్ స్లామ్ సాధించిన రికార్డు నాడాల్ పేరిట ఉంది.
2010, 2013,2017,2019 సంవత్సరాలలో క్లే కోర్టు మీద ఫ్రెంచ్ ఓపెన్, హార్డ్ కోర్టు మీద జరిగే యూ ఎస్ ఓపెన్ టైటిల్స్ గెలిచిన ఏకైక క్రీడాకారుడు నాడాల్. 2005-2014 మధ్య వరుసగా పది సంవత్సరాలలో ప్రతి సంవత్సరం కనీసం ఒకటైనా గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన రికార్డు కూడా నాడాల్ పేరిట ఉంది.
2008 సంవత్సరంలో బీజింగ్ లో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి, అదే సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ టైటిల్స్ గెలిచి పురుషుల విభాగంలో ఒక సంవత్సరం ఒలింపిక్స్ స్వర్ణపతకం, రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఏకైక క్రీడాకారుడుగా రికార్డు సృష్టించాఢు. తన కెరీర్ లో రెండు ఒలింపిక్ స్వర్ణాలు, ప్రతి గ్రాండ్ స్లామ్ లో కనీసం రెండుసార్లు టైటిల్ గెలిచి కెరీర్ గోల్డ్ స్లామ్ రెండు సార్లు గెలిచిన ఏకైక ఆటగాడిగా రికార్డు నాడాల్ పేరిట ఉంది.
ఒకే సంవత్సరంలో ఇంగ్లీషు ఛానల్ కి ఇరువైపులా ఉన్న ఫ్రాన్స్ దేశంలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్, ఇంగ్లాండులో జరిగే వింబుల్డన్ గెలవడాన్ని “ఛానల్ స్లామ్” అంటారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఫ్రెంచ్ ఓపెన్ లో బేస్ లైన్ గేమ్ ఆడాల్సి ఉంటే, వింబుల్డన్ లో సర్వ్ అండ్ వాలీ శైలిలో ఆడాలి. వింబుల్డన్ లో ఎనిమిది సార్లు టైటిల్ గెలిచిన పీట్ సంప్రాస్ ఒకసారి కూడా ఫ్రెంచ్ ఓపెన్ గెలవలేదు. మూడు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ తో పాటు, మొత్తం ఎనిమిది గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన మరో నంబర్ వన్ క్రీడాకారుడు ఇవాన్ లెండిల్ ఒకసారి కూడా వింబుల్డన్ గెలవలేక పోయాడు. మొత్తం అయిదు మంది క్రీడాకారులు ఛానల్ స్లామ్ గెలిస్తే వీరిలో నాడాల్ ఒక్కడే రెండు సార్లు గెలిచాడు. 24 సంవత్సరాల వయసులో నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచి కెరీర్ గ్రాండ్ స్లామ్ సాధించిన అతి చిన్న వయస్కుడుగా కూడా నాడాల్ మరో రికార్డు సాధించాడు.
ఇతర రికార్డులు
2005-2022 సంవత్సరాల మధ్య వరుసగా 850 వారాలు ఏటీపి ర్యాంకింగ్ లిస్టులో టాప్-10 లో నిలిచిన మరో రికార్డు, ముప్పై సంవత్సరాల వయసులో నంబర్ వన్ గా నిలిచిన రికార్డు, క్లే కోర్టులో 450 పైగా మ్యాచ్ లలో విజయాలు, హార్డ్ కోర్టులో మరో 450 పైగా మ్యాచ్ లలో విజయాలు సాధించిన రికార్డు కూడా నాడాల్ స్వంతం.
ఆరునెలల క్రితం మోకాలు ఆపరేషన్ తరువాత అసలు టెన్నిస్ కోర్టులో అడుగు పెట్టగలడా అన్న సందేహం అభిమానులతో సహా నాడాల్ మనసులో కలిగింది. ఇప్పుడు టెన్నిస్ కోర్టులో అడుగు పెట్టడమే కాకుండా తనకన్నా చిన్న వారితో తలపడి హోరాహోరీ పోరాటం చేయగల సత్తా తనలో ఇంకా ఉందని నిరూపించిన నాడాల్ భవిష్యత్తులో తన రికార్డులు తానే అధిగమించడంతో పాటు మరిన్ని రికార్డులు సృష్టించగలడని క్రీడాభిమానులు ఎదురు చూస్తున్నారు.
Also Read : చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో నోవాక్ జోకోవిచ్