Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లో శీతాకాల అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండవరోజు వాడీవేడిగా మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందించే బియ్యంపై చర్చ సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్పి ఇంతవరకు మొదలుపెట్టకుండా మాట తప్పారంటూ ప్రభుత్వాన్ని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. సన్న బియ్యం పంపిణీ అంటూ శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా మొదలు పెట్టిందని, మిగతా ప్రాంతాల్లో ఆ ఊసే లేదని అచెన్న ఎద్దేవా చేశారు.
దీనికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సమాధానం ఇస్తూ…. తాము ఎక్కడా సన్న బియ్యం ఇస్తామని చెప్పలేదని, నాణ్యమైన బియ్యాన్ని అందిస్తామని మాత్రమే చెప్పామని స్పష్టం చేశారు. ముందు సన్న బియ్యానికి, నాణ్యమైన బియ్యానికి తేడా తెలుసుకోవాలని జగన్ ప్రతిపక్షానికి చురకలు అంటించారు. ఎన్నికల ముందు ప్రకటించిన మానిఫాస్టో లో ఎక్కడా వైసీపీ బియ్యం ప్రస్తావన తీసుకురాలేదని, చెప్పని పనులను కూడా ప్రజల కోసం అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందని జగన్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మాసానికి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందిస్తామని చెప్పారు.