Punjab Amarinder -అమరీందర్ కొత్త పార్టీ.. బీజేపీతో కలిసి పోటీ

పంజాబ్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. ఇటీవల సీఎం పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ సొంతంగా పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన ప్రతినిధి రవీన్ తక్రల్ ఈ విషయం అధికారికంగా వెల్లడించారు. త్వరలో కొత్త పార్టీ పేరు, ఇతర వివరాలు ప్రకటిస్తారని పేర్కొన్నారు. అంతకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అమరీందర్ సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట కొత్త పార్టీ రంగప్రవేశంతో కాంగ్రెసుకు ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

రైతులకు మద్దతు

అమరీందర్ సారథ్యంలోని కొత్త పార్టీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తుంది. తమతో కలిసి వచ్చే ఇతర పార్టీల మద్దతు కూడా తీసుకుంటామని అమరీందర్ ప్రతినిధి పేర్కొన్నారు. అమిత్ షాతో భేటీలో ఏడాది కాలంగా జరుగుతున్న రైతు ఉద్యమంపై అమరీందర్ చర్చించారు. కొత్త పార్టీ రైతులకు మద్దతుగా నిలుస్తుందని వెల్లడించారు. కాగా వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఎన్డీయే నుంచి ఆకాలీ దళ్ పార్టీ వైదొలగినప్పటి నుంచి పంజాబులో ఒంటరి అయిన బీజేపీకి అమరీందర్ రూపంలో కొత్త తోడు దొరికింది. వాస్తవానికి సీఎం పదవి నుంచి తప్పుకున్న తర్వాత అమరీందర్ బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. ఆ మధ్య ఆయన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలవడంతో ఆ ప్రచారం బలం పుంజుకుంది. అయితే సొంత పార్టీ ఏర్పాటుకే అమరీందర్ మొగ్గు చూపారు.

కాంగ్రెసుకు కష్టమేనా

కాంగ్రెసుతో నాలుగు దశాబ్దాల అనుబంధం కలిగిన అమరీందర్ రాష్ట్రంలో పార్టీ అగ్రనేతగా ఎదిగారు. 2017 ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపి సీఎం అయ్యారు. పార్టీ నేత నవజ్యోత్ సిద్ధుతో విభేదాలు, పార్టీ అధిష్టానం తీరుతో విసిగిపోయారు. సిద్ధూను పీసీసీ అధ్యక్షుడిగా నియమించడం, తదనంతర పరిణామాల్లో సీఎం పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆయన పార్టీని వీడారు. కొత్త పార్టీ పెట్టాలన్న ఆయన నిర్ణయం కాంగ్రెసుపై తీవ్ర ప్రభావం చూపనుంది. కొద్దినెలల్లో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న ఆ పార్టీకి కెప్టెన్ నిర్ణయంతో కష్టాలు తప్పేలా లేవు.

Also Read : Punjab Elections Siddu -సిద్దూ కుమార్తె పొలిటికల్‌ ఎంట్రీ?

Show comments