Idream media
Idream media
మండల జిల్లా పరిషత్ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు. పోలింగ్ బూత్‌లలో బారులు తీరారు.
ఉదయం 7 గంటల నుంచీ 11 గంటల వరకు కూడా ఓటింగ్ ఒకే విధంగా జరుగుతోంది. మొదటి రెండు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా సరాసరి 10 శాతం లోపు పోలింగ్ నమోదవగా.. తర్వాత రెండు గంటల్లోనూ అదే మొత్తంలో పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 21.65 శాతం మేర పోలింగ్ నమోదైంది.
జిల్లాల వారీగా చూస్తే.. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 25.96 శాతం మేర పోలింగ్ నమోదవగా.. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 15.05 శాతం పోలింగ్ నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో 19.32 శాతం, విజయనగరంలో 25.68, విశాఖలో 24.14, తూర్పు గోదావరిలో 25, పశ్చిమ గోదావరిలో 23.40, కృష్ణాలో 19.29, గుంటూరులో 15.85, శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాలో 20.59, చిత్తూరులో 24.52, అనంతపురంలో 22.88, వైఎస్సార్ కడప జిల్లాలో 19.29 శాతం చొప్పన పోలింగ్ నమోదైంది.
ఎండ అధికంగా ఉండడంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల మధ్య పోలింగ్ కొంతమేర మందకొడిగా సాగే అవకాశం ఉంది. మళ్లీ మూడు గంటల తర్వాత ఊపందుకుంటుంది. సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉండడం వల్ల సాయంత్రం పోలింగ్ భారీగా జరిగే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల్లో సరాసరి 80 శాతం పోలింగ్ నమోదైంది. మరి పరిషత్ ఎన్నికల్లో ఎంత మేర పోలింగ్ నమోదవుతుందో చూడాలి.
Also Read : నేడే పరిషత్ పోరు