ఇమ్రాన్‌కు షాక్‌ ఇచ్చిన పాక్‌ న్యాయస్థానం

ఇమ్రాన్‌ ఖాన్‌కు పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆయనపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం సురీ తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఈ నెల 3న సురీ తిరస్కరించారు. అవిశ్వాస తీర్మానం వెనక విదేశీ కుట్ర ఉందని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ఇమ్రాన్‌ సూచన మేరకు పాక్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. ఈ నిర్ణయాలను సవాలు చేస్తూ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

చీఫ్‌ జస్టిస్‌ ఉమర్‌ అటా బందియాల్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఈ అంశంపై నాలుగు రోజులుగా విచారణ జరుపుతోంది. డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం సురీ ఆర్టికల్‌ 95ను ఉల్లంఘించినట్లు స్పష్టమైందని గురువారం చీఫ్‌ జస్టిస్‌ పేర్కొన్నారు. ఆయన నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే అధ్యక్షుడు జాతీయ అసెంబ్లీని రద్దు చేయడం కూడా రాజ్యాంగ విరుద్ధమని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. జాతీయ అసెంబ్లీని పునరుద్ధరించాలని ఆదేశించింది. సభను రద్దు చేయాలంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ అధ్యక్షుడికి సిఫారసు చేయడం కూడా రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.

ఈ నెల 9న (శనివారం) ఉదయం 10 గంటలకు జాతీయ అసెంబ్లీని సమావేశపరిచి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించాలని స్పీకర్‌ను ఆదేశించింది. మరోవైపు పాకిస్తాన్‌ ఎన్నికల సంఘం కార్యదర్శికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయగా.. న్యాయనిపుణుల బృందంతో కలిసి ఆయన కోర్టుకు హాజరయ్యారు. దేశంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు నాలుగు నెలల సమయం పడుతుందని న్యాయస్థానానికి తెలియజేశారు. మొత్తం 342 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 172 కాగా.. తమకు 177 మంది సభ్యుల బలం ఉందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

కాగా, ఇమ్రాన్‌ ఖాన్‌ తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమెరికా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అమెరికా దౌత్యాధికారి డొనాల్డ్‌ లూ పేరును కూడా ప్రస్తావించారు. విదేశీ కుట్రలను తిప్పికొట్టేందుకు జాతీయ అసెంబ్లీని రద్దు చేసినట్లు చెప్పారు. కానీ, సుప్రీంకోర్టు తీర్పుతో ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ‘కుట్ర’ సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించినట్లయింది. మొత్తంమీద పాకిస్తాన్‌లో ఇప్పటివరకు ఏ ప్రధానీ పూర్తిగా ఐదేళ్లపాటు పదవిలో కొనసాగలేదు.

Show comments