దేశంలో ఎక్కడా లేదు..తెలుగుదేశంలో తప్ప..!

దేశంలో పలు రకాల పార్టీలు ఉంటాయి. అందులో ప్రధానంగా జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలుగా ఎన్నికల సంఘం పరిగణిస్తోంది. ఇక కొన్ని ఉప ప్రాంతీయ పార్టీలు కూడా ఉంటాయి. వాటిలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటన్నది అంతుబట్టకుండా ఉంది. ఆపార్టీని ఈసీ గుర్తించిన దాని ప్రకారం ప్రాంతీయ పార్టీగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ దానికి చంద్రబాబు ససేమీరా అంటారు. తాను జాతీయ అధ్యక్షుడినని చెప్పుకుంటారు. ఆయన తనయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి గా కూడా ఉన్నారు. వారితో పాటుగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లకు విడివిడిగా రాష్ట్రాల అధ్యక్షులు, ఇతరులు కూడా ఉన్నారు.

ఇలాంటి నిర్మాణం దేశంలో ఏపార్టీకి కనిపించదు. వాస్తవానికి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ప్రాంతీయ పార్టీ హోదా కూడా ఉందా అంటే అనుమానంగానే చెప్పాలి. ఇప్పటికే రాయలసీమలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కేవలం ముగ్గురంటే ముగ్గరు మాత్రమే నాలుగు జిల్లాల పరిధిలో విజయం సాధించగా మళ్లీ ఎన్నికల నాటికి కనీసం ఆ మూడు అయినా నిలబడడతాయా లేదా అన్నది సందేహంగా ఉంది. ఇక సీమకు తోడుగా ఉత్తరాంద్రలో కూడా టీడీపీ పునాదులు కూలుతున్నాయి. రాజధాని వికేంద్రీకరణ విషయంలో చంద్రబాబు తీరుతో కార్యకర్తలు వ్యతిరేకంగా ఉన్నారు.

త్వరలో విశాఖలో పాలన ప్రారంభమయితే మిగిలిన వారు కూడా టీడీపీ వెంట నిలిచే పరిస్థితి ఉండదనే అంచనాలున్నాయి. ఇలాంటి సమయంలో కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాలకే పరిమితం కాబోతున్న పార్టీగా టీడీపీని కొందరు అభివర్ణిస్తున్నారు. అందులో అతిశయోక్తులు ఉండవచ్చు గాక గానీ ప్రస్తుతం ఆపార్టీ పయనం అలాంటి పరిమితులకు దారితీయదనే ధీమా అయితే కనిపించడం లేదు.

అయినప్పటికీ చంద్రబాబు మాత్రం తనను తాను జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకునే ప్రయత్నం చేయడం విస్మయకరంగానూ , వింతగానూ కనిపిస్తుంది. ఇప్పటికే దేశంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు టీఎంసీ, అన్నా డీఎంకే, టీఆర్ఎస్, జేడీయూ సహా అన్ని పార్టీలకు ఒక్కో అధ్యక్షుడే ఉన్నారు. కానీ టీడీపీకి మాత్రం ముగ్గురు అధ్యక్షులుండడం విశేషం. గతంలో తన పార్టీని ఎక్కువగా ఊహించుకుని చేసుకున్న చంద్రబాబు ఇలాంటి ఏర్పాట్లు చేశారు. పదేళ్ల తర్వాత అప్పట్లో ఏపీలో అధికారంలోకి రావడంతో ఇక తెలంగాణాలో కూడా పట్టుకాపాడుకోగలమని ఆయన కలలుగన్నారు.

అందుకు తోడుగా అండమాన్ లో గెలిచిన ఓ కౌన్సిలర్ పోస్ట్ ని చూపించి అదే పెద్ద విజయంగానూ, ఒడిశా, కర్ణాటకకి కూడా విస్తరిస్తున్నట్టుగానూ లెక్కలేసుకున్నారు. అలాంటి అతి విశ్లేషణలతో ఆయన అందరినీ విస్తు పరిచేలా తాను జాతీయ అధ్యక్షుడినని చెప్పుకున్నారు. కానీ తీరా చూస్తే సీన్ రివర్స్ అయ్యింది. కొత్తవి రాకపోగా ఉన్న ఏపీ కూడా చేజారిపోయింది. అయినా మొన్నటి ఫలితాల తర్వాత కూడా పాఠాలు నేర్చుకుంటున్న దాఖలాలు లేవు.

ఇప్పటికీ చంద్రబాబు ఊహాల్లోనే ఉన్నారా అనడానికి తనను తాను జాతీయ అధ్యక్షుడిగా కీర్తించుకుంటున్న తీరు ఓ తార్కాణం. పరిస్థితులు మారినా ఆయన మాత్రం పట్టిన కుందేలుకి మూడే కాళ్లు చందంగా సాగుతున్నారనడానికి సంకేతంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దుకుని, అంతో ఇంతో బలం ఉన్న ఒక్క రాష్ట్రంలోనూ పార్టీని కాపాడుకునేందుకు తగ్గట్టుగా తన నిర్మాణ మార్పులు చేసుకుంటే తప్ప టీడీపీకి మనుగడ ఉండదనే విషయం వాస్తవ దూరం కాదనే అనిపిస్తోంది.

Show comments