స్నేహంలోని అందమైన కోణం – Nostalgia

పెద్దగా పేరు లేని గుర్తింపు రాని నలుగురు కుర్రాళ్ళని హీరోలుగా పెట్టి ఒక మ్యూజికల్ స్టోరీని డీల్ చేయడం అంటే వినడానికే ఎంతో రిస్క్ అనిపిస్తుంది కదూ. కానీ భావోద్వేగాలను సరైన రీతిలో చూపించగలిగితే అసలు స్టార్లు ఉన్నారా లేదా అనేది పట్టించుకోకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని చాలా సినిమాలు ఋజువు చేశాయి. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చిత్రం నవ వసంతం. 1989లో తమిళ నటుడు పార్తీబన్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన విక్రమన్ కేవలం సంవత్సరం గ్యాప్ లోనే ప్రముఖ నిర్మాత ఆర్బి చౌదరిని ఒప్పించి తన దర్శకత్వ కలను నెరవేర్చుకోగలిగారు. అదే పుదు వసంతం. ఇది ఎందరికో లైఫ్ ఇచ్చిన మాస్టర్ క్లాసిక్.

అప్పటికి హీరోయిన్ సితారకు ఉన్నది కేవలం నాలుగు సినిమాల అనుభవం. విక్రమన్ ఇమేజ్ ఉన్నవాళ్లను తీసుకుంటే ఇబ్బందులు వస్తాయని గుర్తించి అమాయకత్వం అందం రెండు కలబోసిన ఆమెను ఎంచుకున్నారు. మురళి, ఆనంద్ బాబు, దగ్గుబాటి రాజా, ఛార్లీని ప్రధాన పాత్రలకు ఎంచుకున్నారు. ఇళయరాజా హవాలోనూ అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటున్న ఎస్ఏ రాజ్ కుమార్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఎప్పటికి గుర్తుండిపోయే గొప్ప పాటలను ఇవ్వాలనే హామీ మీద ఇద్దరికి ఒప్పందం కుదిరింది. బడ్జెట్ హడావిడి లేకుండా చాలా తక్కువ సమయంలో విక్రమన్ వేగంగా సినిమాను పూర్తి చేశారు.

Also Read: సూపర్ స్టార్ కోసం ఖల్ నాయక్ ?

ఉద్యోగం లేక సంగీతమే ప్రపంచంగా బ్రతుకుతూ అందులోనూ తమ సత్తా చాటాలని తాపత్రయపడే నలుగురు కుర్రాళ్ళ జీవితంలోకి ఒక మూగమ్మాయి గౌరీ వస్తుంది. మంచి స్నేహితులుగా మారతారు. అయితే తనకు మాటలు వస్తాయని దాని వెనుక ఒక బలమైన కారణం ఉందని తెలుసుకుంటారు. ఆమె ప్రేమకథకు మద్దతు పలుకుతారు. వీరి జీవితం ఎన్నో మలుపులు తిరిగాక గౌరీ కళ్ళముందే వాళ్ళు గొప్ప స్థాయికి చేరుకుంటారు. తన ప్రేమ విఫలమైనా వాళ్ళ స్నేహాన్ని గౌరీ చిరకాలం కోరుకోవడంతో కథ కంచికి చేరుతుంది. 1990 ఏప్రిల్ 14న తమిళంలో రిలీజైన ఈ చిన్న సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది ఏకంగా 25 వారాలు ప్రదర్శింపబడి రికార్డులు సృష్టించింది. తెలుగులో అదే సంవత్సరం ఆగస్ట్ 3న విడుదలై ఇక్కడా ఘన విజయం సొంతం చేసుకుంది. ఇందులో క్లైమాక్స్ లో లాగే నిజజీవితంలోనూ సితార అవివాహితగానే మిగిలిపోవడం కాకతాళీయం

Also Read: టాలీవుడ్ లో ఒక అరుదైన థ్రిల్లర్ – Nostalgia

Show comments