మున్సిపల్‌ పోలింగ్‌ నేడు.. అందరి దృష్టి ఆ నాలిగింటిపైనే..

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు అంతా సిద్ధమైంది. ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కాబోతోంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. బ్యాలెట్‌ పద్ధతిలో పార్టీ గర్తులపై మున్సిపల్‌ పోలింగ్‌ జరుగుతుంది. అవసరమైన చోట ఈ నెల 13వ తేదీన రీ పోలింగ్‌ నిర్వహించి, 14వ తేదీన లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు. పోలింగ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లను యంత్రాంగం సిద్ధం చేసింది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. పట్టణ ఓటర్లు ఓటు వేయాలంటూ ఇప్పటికే ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఓ వీడియోను విడుదల చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 109 మున్సిపాలిటీలు, 16 కార్పొరేషన్లు ఉండగా, కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల మూడు కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగడం లేదు. ప్రస్తుతం 75 మున్సిపాలిటీల్లో పోరు జరుగుతోంది. కాకినాడ కార్పొరేషన్‌ పాలక మండలికి గడువు ఉండడంతో అక్కడ మరో రెండేళ్ల తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

12 కార్పొరేషన్లలోని 671 డివిజన్లకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇందులో 89 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 582 డివిజన్లకు పోలింగ్‌ జరగబోతోంది. చిత్తూరు కార్పొరేషన్‌లో పాలక వర్గం ఏర్పాటుకు అవసరమైన స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకోవడంతో మేయర్‌ పీఠం వైసీపీ ఖాతాలో పడింది.

75 మున్సిపాలిటీల్లోని 2,123 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇందులో 479 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా వైసీపీ 470 వార్డులను గెలుచుకుంది. టీడీపీ ఆరు, బీజేపీ ఒకటి, స్వతంత్రులు రెండు వార్డుల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Also Read : ఏలూరు ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌

మెజారిటీ వార్డులు ఏకగ్రీవం కావడంతో పోలింగ్‌కు ముందే 12 మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంది. పుంగనూరు, పులివెందుల, మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లోని అన్ని వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. రాయచోట, పలమనేరు, ఆత్మకూరు. నాయుడుపేట, సూళ్లూరుపేట, కొవ్వూరు, డోన్, తుని మున్సిపాలిటీలను కూడా పోలింగ్‌కు ముందే వైసీపీ తన ఖాతాలో వేసుకుంది.

పంచాయతీ ఎన్నికల్లో విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న వైసీపీ మున్సిపల్‌ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం నిర్వహించింది. ఆ పార్టీ తరఫున స్థానిక మంత్రులు అభ్యర్థులతో కలసి ఇంటింట ప్రచారం చేశారు. టీడీపీ తరఫున ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణలు ముమ్మరంగా ప్రచారం చేశారు. బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. పురపోరులో జనసేన పోటీ చేస్తున్నా.. ఆ పార్టీ అభ్యర్థుల తరఫున జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారానికి రాలేదు. ఈ రోజు సాయంత్రం లోపు అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తం కానుంది. ఈ నెల 14వ తేదీన లెక్కింపు రోజు వారి భవితవ్యం తేలిపోతుంది.

12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగుతున్నా.. అందరి దృష్టి నాలుగు కార్పొరేషన్లపైనే కేద్రీకృతమైంది. కర్నూలు, గుంటూరు, విజయవాడ, విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార వైసీపీ, టీడీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నాలుగు కార్పొరేషన్లలో దాదాపు అన్ని వార్డుల్లోనూ పోటీ నెలకొనడం టీడీపీ, వైసీపీ మధ్య పోటీ ఏ స్థాయిలో ఉందో తెలుపుతోంది. మూడు రాజధానులు ప్రకటించిన తర్వాత జగన్‌ సర్కార్‌ ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందో ఈ ఎన్నికల్లో తేలిపోనుంది.

Also Read : నెల్లూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగేదేప్పుడు?

Show comments