iDreamPost
iDreamPost
వర్తమాన రాజకీయాలు ఎలా ఉన్నాయో కళ్లారా చూస్తున్నాం. ఓటరుని మెప్పించి అధికారంలోకి వచ్చేందుకు ఢిల్లీ నుంచి గల్లీ దాకా నాయకులు వేసే ఎత్తులు, ప్రత్యర్థులను చేసే చిత్తులు మనకు కొత్తేమీ కాదు. కాకపోతే సినిమా మాధ్యమం ద్వారా వాటిని సరిగ్గా చూపించగలిగితే ప్రేక్షకులు ఆదరించడమే కాదు కాసులు కూడా కురిపిస్తారు. దానికి ఉదాహరణ ఎంఎల్ఏ ఏడుకొండలు. ఆ ముచ్చట్లు చూద్దాం. 1982లో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వచ్చినప్పుడు దాసరి చాలా బిజీగా ఉన్నారు. ఏఎన్ఆర్ లాంటి అగ్రహీరోలతో భారీ ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. ఎన్టీఆర్ బొబ్బిలి పులి రేపిన సంచలనం ఇంకా జనం మదిలో నుంచి చెరిగిపోలేదు.
స్వయంవరం, గోల్కొండ అబ్బులు, మేఘ సందేశం, యువరాజు ఒకదాన్ని మించి మరొకటి సక్సెస్ లు కొనసాగుతున్నాయి. ఇంత టైట్ షెడ్యూల్ లోనూ జనంలో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఎంఎల్ఏ ఏడుకొండలు స్క్రిప్ట్ ని అతి వేగంగా సిద్ధం చేసుకున్నారు దాసరి నారాయణరావు. స్టార్లు క్షురకుడి పాత్ర చేయడానికి సాహసించరు కాబట్టి తనే చేయాలని నిర్ణయించుకున్నారు. 1982లో నవంబర్ లో షూటింగ్ మొదలుపెట్టారు. సుజాత, గుమ్మడి, అల్లు, పేకేటి శివరాం, ఆర్ నారాయణమూర్తి, ప్రభాకర్ రెడ్డి, సూర్యకాంతం, జయమాలిని ఇలా క్యాస్టింగ్ ని గట్టిగా సెట్ చేసుకుని కేవలం ఇరవై రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశారని సినీ జనం గొప్పగా చెప్పుకునేవారు.
చక్రవర్తి సంగీతం అందించగా కెఎస్ మణి ఛాయాగ్రహణం సమకూర్చారు. సమాజంలో ఉన్న అసమానతలు అన్యాయాల గురించి అమాయకంగా ఆలోచించే ఓ క్షురకుడు ఎలా ఎంఎల్ఏ అయ్యాడు తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి లాంటి సంఘటనలు ఆసక్తికరంగా దాసరి చూపించిన తీరు ఆడియన్స్ ని బ్రహ్మాండంగా నచ్చింది. 1983 జనవరి 9న విడుదలైన ఎంఎల్ఏ ఏడుకొండలులో స్టార్ పవర్ లేకపోయినా దర్శకరత్న పెన్ పవర్ కు బ్రహ్మరథం దక్కింది. ఫలితంగా 25 వారాలు ఆడింది సినిమా. దీన్నే హిందీలో జితేంద్రతో ఆజ్ కా ఎంఎల్ఏ పేరుతో రీమేక్ చేయడం విశేషం. ఇప్పుడీ సినిమా చూసినా ప్రస్తుత రాజకీయాలకు అద్దం పడతాయి
Also Read : Krishna : సూపర్ స్టార్ ఫ్యామిలీ ఫస్ట్ కాంబినేషన్ – Nostalgia