Mantralayam- తిక్కారెడ్డిపై హత్యాయత్నం జరిగిందా..?

దశాబ్ధాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటుంటే.. దాన్ని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఆపాదిస్తూ.. హత్యా రాజకీయాలంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆపాదించడం ఓ తంతుగా మారిపోయింది. తాజాగా కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం, కోసిగి మండలం పెద్ద భూంపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి రథోత్సవంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఐదుగురు గాయపడ్డారు.

అక్కడకు టీడీపీ ఇంఛార్జి తిక్కారెడ్డి తన అనుచరులతో వెళ్లడంతో.. స్థానికులు ఆధిపత్యం కోసం ప్రయత్నించడం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనను కూడా టీడీపీ వైసీపీ ప్రభుత్వానికి, వైఎస్‌ జగన్‌కు ఆపాదిస్తోంది. తిక్కారెడ్డిని హత్య చేసేందుకు యత్నించారంటూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్‌ తలాతోక లేకుండా ఆరోపణలు చేయడం ప్రారంభించారు.అసలు చరిత్ర తెలుసుకుంటే.. ఏం జరిగింది అర్థమవుతుంది.

తిక్కారెడ్డి మొదట కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు. అన్ని విధాలా బలమైన నేత. కోట్ల వర్గంలో ఉండేవారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పటి నుంచీ ఘర్షణ వాతావరణం కోరుకునే నాయకుడు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎమ్మిగనూరు టిక్కెట్‌ కోసం ప్రయత్నించేవారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో మంత్రాలయం నియోజకవర్గం ఏర్పడింది. అప్పుడు మంత్రాలయం టిక్కెట్‌ కోసం యత్నించారు.

2009లో ఎమ్మిగనూరు నుంచి కాంగ్రెస్‌ తరఫున చెన్నకేశవరెడ్డి, టీడీపీ తరఫున మోహన్‌ రెడ్డిలు పోటీ చేశారు. ఆలూరు జనరల్‌ అయింది. అప్పటికి కోట్ల వర్గానికి తిక్కారెడ్డి దూరంగా జరిగారు. దీంతో తిక్కారెడ్డికి టిక్కెట్‌ రాకుండా చేయాలనే లక్ష్యంతో.. 2004లో పత్తికొండ నుంచి గెలిచిన నీరజా రెడ్డిని 2009లో ఆలూరు నుంచి పోటీ చేయించారు. ఆలూరులో బోయలు ఎక్కువ. బోయలకు ఒక టిక్కెట్‌ ఇవ్వాలని భావించిన కాంగ్రెస్‌.. మంత్రాలయంలో ఇచ్చింది. అక్కడ బోయ సామాజికవర్గానికి చెందిన దలవాయి రామయ్యకు కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఇచ్చింది.

ఆదోనీ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న సాయిప్రసాద్‌ రెడ్డి తమ్ముడైన బాలనాగిరెడ్డికి.. చంద్రబాబు పిలిచి ఆ నియోజకవర్గం పక్కనే ఉన్న మంత్రాలయం టిక్కెట్‌ ఇచ్చారు. 2009లో మంత్రాలయం నుంచి కాంగ్రెస్‌ తరఫున దలవాయి రామయ్య, టీడీపీ తరఫున బాలనాగిరెడ్డి పోటీ చేశారు. టిక్కెట్‌ రాకపోయినా తిక్కారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కోసం గట్టిగా పని చేశారు. ఆ ఎన్నికల్లో గొడవలు జరిగాయి. తిక్కారెడ్డికి గాయాలయ్యాయి. బాలనాగిరెడ్డి కుటుంబానికి అక్కడ బలం ఉండడంతో టీడీపీ గెలిచింది.

Also Read : రాజీమార్గంలో మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే

గెలిచిన కొద్ది రోజులకే బాలనాగిరెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరెడ్డిని కలిశారు. దాన్ని తిక్కారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘మా గాయాలు ఇంకా మానలేదు, అప్పుడే మీరు బాలనాగిరెడ్డిని చేర్చుకుంటున్నారని’’అసహనం వ్యక్తం చేశారు.

2014లో వైసీపీ టిక్కెట్‌ బాలనాగిరెడ్డికి దక్కింది. తిక్కారెడ్డి టీడీపీ తరఫున పోటీ చేశారు. బాలనాగిరెడ్డి గెలిచారు. వాస్తవంగా బాలనాగిరెడ్డి కన్నా ముందు తిక్కారెడ్డి వైసీపీలో చేరారు. ఆదోని డివిజన్‌ మొత్తం (ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం) బాధ్యత తనదేనని తిక్కారెడ్డి భావించారు. అందుకు వైఎస్‌ జగన్‌ సుముఖంగా లేరు. తిక్కారెడ్డి తర్వాత బాలనాగిరెడ్డి కూడా వైసీపీలో చేరారు. ఈ పరిణామంతో తనకు వైసీపీలో అవకాశం రాదనుకున్న తిక్కారెడ్డి టీడీపీలోకి వెళ్లిపోయారు.

2019లో మరోసారి బాలనాగిరెడ్డి, తిక్కారెడ్డిలు తలపడ్డారు. మళ్లీ బాలనాగిరెడ్డే గెలిచాడు. నామినేషన్‌ సమయంలో జరిగిన గొడవల్లో తిక్కారెడ్డి తొడలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. ఘర్షణ సమయంలో తిక్కారెడ్డి గన్‌మెన్‌ ఫైర్‌ ఓపెన్‌ చేయడంతో.. పొరపాటున బుల్లెట్‌ తిక్కారెడ్డి తొడకే తగిలింది.

ఆదోనీ డివిజన్‌లోని కొన్ని గ్రామాలలో ఘర్షణ వాతావరణం ఉంటుంది. వర్గ రాజకీయాల్లో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో జరిగిందే పెద్ద భూంపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి రథోత్సవంలో జరిగిన గొడవ. ఆధిపత్యం కోసం పోటీ పడడడంతో ఈ పరిస్థితి నెలకొంది.

తిక్కారెడ్డి అన్ని పార్టీలలో ఉన్నారు. 2009 నుంచి బాలనాగిరెడ్డి, తిక్కారెడ్డిలు ప్రత్యర్థులుగా మారారు. తిక్కారెడ్డి గత చరిత్ర చూస్తే.. ఆయన ఘర్షణ వాతావరణం కోరుకుంటున్నారని తెలుస్తోంది. తిక్కారెడ్డి తన అనుచరులతో పెద్ద భూంపల్లికి వెళ్లారు. బాలనాగిరెడ్డి, ఆయన కుమారుడు అక్కడ లేరు. స్థానిక నేతల ఆధిపత్యం పోరులో జరిగిన ఘర్షణ తప్పా.. దాన్ని హత్యాయత్నం అనడానికి అవకాశం లేదు. దాన్ని ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదు. గత చరిత్ర, స్థానికంగా ఉండే రాజకీయ పరిస్థితులు తెలుసుకుంటే.. నారా లోకేష్‌ చేస్తున్న ఆరోపణల్లో ఆసలు నిజానిజాలు ఏమిటో తెలుస్తాయి.

Also Read : సినిమా రివ్యూలు మొద‌లుపెట్టిన చంద్ర‌బాబు

Show comments