Pokiri పోకిరి క్రేజుకి మైండు బ్లాంకు

ఒక సినిమా విడుదలైన పదహారేళ్ళ తర్వాత దానికి థియేటర్లో మళ్ళీ క్రేజ్ రావడం సాధ్యమా. అది కూడా కొత్త చిత్రాలే రెండు మూడు వారాలకు ఓటిటిలో దొరుకుతున్న టెక్నాలజీ ట్రెండ్ లో. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. పోకిరి మేనియా ఆ స్థాయిలో ఊపేస్తోంది. రేపు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి ప్రింట్ ని రీ మాస్టర్ చేసి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఎంపిక చేసిన స్క్రీన్లలో మాత్రమే ప్రత్యేక ప్రీమియర్లు వేయాలని ముందు ప్లాన్ చేసుకున్నారు. తీరా చూస్తే డిమాండ్ అమాంతం పెరిగిపోయి ఎక్కడిక్కడ కౌంట్ పెంచుకుంటూ పోవాల్సి వస్తోంది . ఏదో మహేష్ బాబు కొత్త మూవీ రిలీజవుతోందన్నంత హడావిడి సోషల్ మీడియాలో ఉంది.

ఉదాహరణకు హైదరాబాద్ నే తీసుకుంటే ముందు నాలుగైదు షోలు అనుకున్నారు. తీరా ఇప్పుడవి నలభైకి దగ్గరలో ఉన్నాయి. ఒక్క ప్రసాద్ ఐమ్యాక్స్ లోనే పది దాకా వేస్తే అన్నీ అడ్వాన్స్ లోనే హౌస్ ఫుల్ అయ్యే పరిస్థితి. ఇక లాభం లేదని వేరే మల్టీ ప్లెక్సుల్లో కూడా వేయడం మొదలుపెట్టారు. అక్కడే కాదు వరంగల్ తో మొదలుపెట్టి అనంతపూర్ దాకా కరీంనగర్ ఉంచి కర్నూల్ దాకా ప్రతి చోటా పోకిరికి ఒకే రకమైన రెస్పాన్స్ వస్తోంది. యుట్యూబ్ లోనే హెచ్డి క్వాలిటీతో అందుబాటులో ఉన్న పోకిరిని ఇలా బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేసేందుకు ఈ స్థాయిలో ఎగబడటం నిర్వాహకులు ఊహించనిది. ఎఎంబిలో అయితే టికెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడుపోయాయి.

ఇది మహేష్ బాబు ఫాలోయింగ్ మహాత్యమే అయినా పోకిరి అప్పట్లో సృష్టించిన సంచలనం తాలూకు వైబ్రేషన్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదు. ఆ టైంలో పిల్లలుగా ఉండి థియేటర్ ఎక్స్ పీరియన్స్ మిస్ చేసుకున్న వాళ్ళు క్షణం ఆలోచించకుండా పోకిరి టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. అలా అని ధరలు డిస్కౌంట్ లో ఏమి లేవు. కొత్త సినిమాలకు ఎంత ఉందో పోకిరికీ అంతే ఫిక్స్ చేశారు. అయినా కూడా ఈ స్థాయి ప్రభంజనం ఊహించనిది. సినిమాలో హీరో క్యారెక్టర్ మహేష్ చెప్పినట్టు ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు అనే డైలాగు ఇప్పుడు కూడా నిజమవుతోంది

Show comments