iDreamPost
iDreamPost
మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక నాయకుడు కూల్చివేస్తానని బెదిరించాడు. అనుకున్నంత పని చేస్తాడుకూడా. ఒక పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలను పోగేసి, వేరే పార్టీ స్పాన్సర్ షిప్, భరోసాతో తన ప్రభుత్వానికే మరణశాసనం రాస్తున్నాడు. అంతేకాదు, అసలు శివసేన పార్టీయే నాదంటున్నాడు. అతని పేరు ఏక్ నాథ్ షిండే.
ఇలాంటి రాజకీయ తిరుగుబాటు కొత్తదేమీకాదు. ఎన్టీరామావుకు వెన్నుపోటు నుంచి మధ్యప్రదేశ్ సింధియా వరకు రాజకీయ తిరుగుబాట్లు, వెన్నుపోట్లు చాలానే చూశాం. 2020లో జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటు చేశాడు. కొంతమంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకెళ్లి, కమల్ నాథ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని కూల్చేశాడు. ఈ యువ నేత రాహూల్ గాంధికి బాగా క్లోజ్. మహారాష్ట్ర తరహాలో మధ్యప్రదేశ్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను హోటళ్లలో దింపలేదు. ఇతర రాష్ట్రాలకు పంపించలేదు. జ్యోతిరాదిత్య సింధియాకు డబ్బు అవసరంలేదు. చిత్త శుద్ధి ఉన్న వ్యక్తే. మరెందుకు నమ్ముకున్న పార్టీని కూల్చేశాడు? పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని నమ్మాడు. పక్క పార్టీ ప్రభావం అనండి, లేదంటే తన వర్గ ఎమ్మెల్యేల ఒత్తిడి అనండి. ఏకంగా ప్రత్యర్ధి పార్టీలోకి మారిపోయాడు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిపోయాడు. సింధియాకు మంత్రిపదవి వచ్చింది. అతని వర్గ ఎమ్మెల్యేలకు రాష్ట్రప్రభుత్వంలో వసతిని కల్పించారు. ఈ తిరుగుబాటుతో అతనికి, అతని వర్గానికి లాభం.
ఇప్పుడు రాజకీయాలు ఎంతవేగంగా మారిపోతున్నాయంటే, ఇక్కడ సైద్ధాంతికత, నిబద్ధత లాంటివి చెల్లని నాణాలుగా కనిపిస్తున్నాయి. చాలామంది ఎమ్మెల్యేలకు పార్టీమీద విశ్వాసం ఉందనికూడా అనుకోలేం. పార్టీ పేరుతో గెలిచి, ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ల నెత్తిమీద ఒక రేటు ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయంటే చాలు, జంప్ చేయడానికి సిద్ధం. అంతెందుకు మహారాష్ట్రలో షిండే వెనుకున్న ఎమ్మెల్యేలకు ఆయన పట్ట విశ్వాసం, గౌరవం ఉందనికూడా అనుకోలేం.
ఇప్పుడు ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఎర్పాటు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదు. ఓడిపోయినా మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఎర్పాటుచేసింది. అస్సోంలో ఏకంగా అధికారాన్నే ఎలా సొంతం చేసుకొందో చూశాం. రాజస్థాన్ లో సింధియా తరహాలోనే ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలని ప్రయత్నించింది. కాని, సచిన్ పైలెట్ మరో సింధియా కాలేకపోయారు. అయితే, ప్రభుత్వాలను కూల్చడంలో, లేదంటే మార్చడంలో బీజేపీ చాలాసార్లు విజయవంతమైందికూడా. ఈ విషయంలో బీజేపీ స్ట్రయిక్ రేట్ కు తిరుగులేదు. అందుకే ప్రత్యర్ధి పార్టీ ఎమ్మెల్యేలు మాతో టచ్ ఉన్నారు, అవసరమనుకొంటే!!! అని బెదిరించగలదుకూడా.
తిరుగుబాటుకు ఖర్చెంత?
ఈ తిరుగుబాట్లలో చాలా వరకు సిద్ధాంతాలకు, పాలనకు ఎలాంటి లింక్ ఉండదు. ప్రజలు చూస్తున్నారన్న బెదురూ ఉండదు. ఎమ్మెల్యేల కొనుగోళ్లు, అమ్మకాలు మాత్రమే ఉంటాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. సైద్ధాంతికత పేరుమీదుగా సాగే తిరుగుబాట్లు విజయవంతంకావాలంటే వందలకోట్లు, వేల కోట్లు ఖర్చు అవుతాయికూడా. ఎమ్మెల్యేలు వెళ్లడానికి విమానాలు, రిసార్టులు, హోటళ్లు, ఖర్చు పెట్టేది ఎవరు? అసలు వాళ్లను తిరుగుబాటు చేయమని ప్రోత్సహించడానికి కూడా ఎన్ని సూట్ కేసులు మారి ఉంటాయి? మధ్యవర్తులు తీసుకొనేది ఎంత?
కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లుగా బీజేపీని మీరు ఎన్నుకోకపోయినా అది అధికారంలోకి వస్తుంది. మమ్మల్ని గెలిపిస్తే మీకే మంచిది. లేదంటే మీరు ఎన్నుకున్న ప్రభుత్వాని ఎలాగూ కూల్చేస్తాం. ఏ పార్టీ అయినా మా తిరుగుబాటు జైత్రయాత్రలకు అతీతంకాదని ప్రజలకు చెప్పాలనుకొంటోందని మహారాష్ట్ర సంక్షోభాన్ని చూస్తున్న రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఎన్నికలుకూడా స్టార్టప్ తోనే సమానం. ఎన్నికల్లో ఖర్చు చేస్తారు. వచ్చే ఎన్నికల్లో గెల్చినా, ఓడినా, ఆదాయానికి లోటులేకుండా సంపాదించాలని చూస్తారు. ఇప్పుడు వాళ్లంతా రాజకీయ పారిశ్రామిక వేత్తలు. మరి ఓటర్లు ఎవరు? వారి ఆశలను నిజం చేసే వినియోగదారులు.