అర్థరాత్రి వ్యక్తిపై దాడి.. గొడ్డును బాదినట్లు బాదారు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కొంత మంది యువకులు రెచ్చిపోయారు. అర్థరాత్రి ఓ వ్యక్తిపై అత్యంత దారుణంగా దాడిచేశారు. కర్రలతో కొడుతూ.. చితకబాదారు. ఒక్కరు కాదూ ఇద్దరూ కాదు.. కొంత మంది యువకుల గుంపు ఈ దుశ్చర్యకు పాల్పడింది. రక్తం వస్తున్నా కూడా వదలకుండా విచక్షణారహితంగా కొడుతూనే ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన కృష్ణా నగర్‌లోని లక్ష్మీ నరసింహ నగర్‌లో అక్టోబర్ 7వ తేదీన జరిగింది. బాధితుడ్ని చందుగా గుర్తించారు. అయితే చందుపై దాడి చేసిన వ్యక్తి  బీఆర్ఎస్ కార్యకర్త అని తెలుస్తోంది.

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అనుచరుడ్ని చెప్పుకుంటూ తిరుగుతున్న భాస్కర్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని సమాచారం. చందు అర్థరాత్రి ఓ మహిళతో ఉండగా.. అదే సమయంలో అటుగా వచ్చిన లలిత్ అనే వ్యక్తి ఇక్కడ ఎందుకు ఉన్నారని, ఏం చేస్తున్నారని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో లలిత్, భాస్కర్ మరికొంత మంది యువకులు కలిసి.. ఇష్టమొచ్చినట్లు చందుపై దాడి చేశారు. కర్రలు తీసుకుని బాదారు. చందును యువకుల గుంపు గొడ్డును బాదినట్లు బాదగా.. ఆ దృశ్యాలు తమ దృష్టికి రావడంతో సుమోటోగా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

గాయపడిన చందు ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుని వెళ్లినట్లు తమకు సమాచారం అందిందన్నారు. ప్రస్తుతం భాస్కర్, లలిత్ లను అదుపులోకి తీసుకున్నామని, మరో ముగ్గరు నిందితులు పరారీలో ఉన్నారని వెల్లడించారు. ఇదిలా ఉంటే అతడు ఎమ్మెల్యే పీఎ అంటూ వార్తలు రావడంతో పోలీసులు అతడు కేవలం కార్యకర్త మాత్రమేనని పేర్కొన్నారు. పాత పీఎను ఎమ్మెల్యే తొలగించిన తర్వాత.. తానే ఆయన పీఎను అంటూ భాస్కర్ చెప్పుకుంటూ తిరుగుతున్నాడని తెలిపారు. బాధితుడు, నిందితులకు ఎలాంటి పరిచయం కూడా లేదని చెప్పారు.

Show comments