వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిలిచిన బీజేపీ

కేంద్రంలో వ్యవసాయ బిల్లులకు కట్టుబడి ఉన్నామని చెబుతున్న కమలదళం కేరళలో మాత్రం భిన్నంగా స్పందించింది. తాజాగా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి సంఘీభావంగా కేరళ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమయ్యింది. ఆ మూడు చట్టాల అమలుని వ్యతిరేకిస్తూ తీర్మానం ఆమోదించారు. సహజంగా కేరళలో అధికార లెఫ్ట్, విపక్ష కాంగ్రెస్ పార్టీలు జాతీయ స్థాయిలో కూడా వాటిని వ్యతిరేకిస్తున్నందున ఆ రెండు పక్షాలు రైతులకు అనుకూలంగా ఓట్లేయడంలో పెద్ద విశేషం లేదు. కానీ అనూహ్యంగా బీజేపీ కూడా బిల్లులకు వ్యతిరేకంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఓటేసింది. అది కూడా ఆపార్టీకి చెందిన ఓ రాజగోపాల్ కావడం విశేషంగా మారింది.

కేరళ అసెంబ్లీలో ఏకైక బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఓ రాజగోపాల్ సీనియర్ రాజకీయ నేత. సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. ఆయన గతంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఎన్డీయే ప్రభుత్వంలో వాజ్ పాయ్ హయంలో కేంద్ర మంత్రిగానూ ఉన్నారు. 1999-2004 మధ్య మంత్రిగా పనిచేశారు. అంతేగాకుండా బీజేపీ పార్టీ కూడా ఆయన సీనియారిటీని గుర్తించింది. రెండు దఫాలు ఆయనకు మధ్యప్రదేశ్ నుంచి రెండుసార్లు రాజ్యసభ అవకాశం వచ్చింది. 1992 నుంచి 2004 మధ్య ఆయన ఎగువ సభ సభ్యుడిగా ఉన్నారు.ఇక ఆ తర్వాత కేరళ చరిత్రలోనే తొలిసారిగా బీజేపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన చరిత్ర సృష్టించారు. అంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు తమ ప్రభుత్వమే ప్రవేశ పెట్టిన బిల్లులను తన రాష్ట్ర అసెంబ్లీలో వ్యవతిరేకించడం చర్చనీయాంశం అయ్యింది.

జాతీయ స్థాయిలో ఎలా ఉన్నప్పటికీ బీజేపీ ఆయా రాష్ట్రాల అవసరాల రీత్యా పలు కీలక నిర్ణయాల్లో స్వరం మార్చడం చాలాకాలంగా ఉంది. ముఖ్యంగా బీఫ్ వివాదం విషయంలో జాతీయ స్థాయిలో బీజేపీ నేతల తీరుకి గోవా సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఆపార్టీ వైఖరికి పొంతన కనిపించదు. అంతేగాకుండా జెరుసలేం యాత్రకి మిజోరం వంటి రాష్ట్రాల్లో రాయితీలు ఇస్తూ మిగిలిన చోట్ల దానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండడం బీజేపీ తీరుకి అద్దంపడుతోంది. తాజాగా వ్యవసాయ బిల్లుల విషయంలో కూడా ఇప్పటికే బీజేపీ మిత్రపక్షాలు కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. ఇక ఇప్పుడు నేరుగా ఆపార్టీ నేతలే అసెంబ్లీలో ఓటేయడం గమనార్హం.

Show comments