KCR,TRS – కేసీఆర్‌లో మార్పు వచ్చిందా..?

గత ఏడేళ్ల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దగా ప్రజల్లోకి వచ్చిన సందర్భం ఏదీ లేదు. రాజకీయంగా బలంగా ఉండటమో లేకపోతే ప్రజలు తనను బలంగా నమ్ముతారనే అతివిశ్వాసమో గాని సీఎం కేసీఆర్ ఏడేళ్ల కాలంలో పెద్దగా ప్రజల్లోకి వచ్చిన సందర్భాలు అంటూ ఏమీ లేవు.కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి విపక్షాలు ఏ అంశాన్ని ఎత్తుకున్నా సరే ఆయన పెద్దగా ప్రజల్లోకి వచ్చి ప్రజలతో కలిసిన సందర్భాలు లేవనే చెప్పాలి. అయితే గత ఏడాది నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శైలిలో చాలా మార్పులు కనబడుతున్నాయి.

తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సీఎం కేసీఆర్ పెద్దగా ప్రజల్లో కనబడకుండా అప్పుడప్పుడు మాత్రమే మీడియా సమావేశాలు దీక్షలు చేసేవారు. తెలంగాణ ఉద్యమం చివరి దశలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ కాస్త ప్రజల్లో ఉండే ప్రయత్నం చేయగా ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో కాస్త గట్టిగానే తిరిగారు. ఇక 2014 నుంచి కూడా ఏదైనా ఎన్నిక ఉంటే బయటికి రావడం లేకపోతే మాత్రం ప్రగతి భవన్ కు లేదా ఆయన ఫాంహౌస్ కు మాత్రమే పరిమితం కావడం అనేది జరుగుతూ వచ్చింది.

అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఎన్నికలు మొదలైన తర్వాత ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధం కావడం కాస్త తెలంగాణ రాజకీయ వర్గాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా దానిపై చర్చ జరుగుతోంది. హుజురాబాద్ ఎన్నికలకు ముందు ప్రజల్లోకి రావడమే కాకుండా కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడం, ఆ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు హామీలు ఇవ్వడం వంటివి చేశారు. ఎన్నిక పూర్తయిన తర్వాత మీడియా సమావేశాలను ఏర్పాటు చేయడం కేంద్ర ప్రభుత్వాన్ని నిందించటం వంటి కార్యక్రమాలను వేగంగా చేయగలిగారు.

ఇక ఇప్పుడు ప్రతి నెలా కూడా నాలుగైదు జిల్లాలలో సీఎం కేసీఆర్ పర్యటన చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈనెల 16 నుంచి జిల్లాల పర్యటనకు వెళుతున్న సీఎం కేసీఆర్… ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పార్టీ కార్యాలయాలను అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ఓపెన్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇక ఇప్పటి నుంచి ప్రతి జిల్లాలో కూడా పర్యటిస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు అలాగే అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును నాయకుల పనితీరుని, అధికారుల పనితీరును స్వయంగా తెలుసుకోనున్నారు.

అధికారుల పనితీరు తో పాటుగా ఎమ్మెల్యేలు అలాగే నియోజకవర్గాల ఇన్చార్జిలు పనితీరుని తెలుసుకోవడం, అలాగే స్థానిక నాయకులతో మాట్లాడటం క్షేత్ర స్థాయి అధికారులతో మాట్లాడటం సంక్షేమ కార్యక్రమాలు ఎవరికి అందుతున్నాయి… ఏంటనే దానికి సంబంధించి ప్రజలతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయడం వంటివి సీఎం కేసీఆర్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కూడా సీఎం కేసీఆర్ దృష్టి పెట్టే అవకాశం కనబడుతోంది. హుజురాబాద్ ఎన్నికల్లో బిజెపి గెలవడం వలనో లేక ప్రతిపక్షాలు బలపడుతున్నాయనే అనుమానాలో గాని నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం మాత్రం టిఆర్ఎస్ పార్టీ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

Also Read : సంక్షేమంలో ఏపీ ఫస్ట్, తెలంగాణ సెకండ్‌.. ఇదిగో నివేదిక

Show comments