ఆ వైసీపీ ఎమ్మెల్యే రూటే సపరేటు..!

మానుగుంట మహీధర్‌ రెడ్డి.. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఈ పేరు సుపరిచితం. కందుకూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు శాసన సభకు ప్రాతినిధ్యం వహించిన మహీధర్‌ రెడ్డి.. ప్రజా సమస్యల పరిష్కారంలో, నియోజకవర్గ అభివృద్ధిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి నిత్యం ప్రజల్లో ఉండాలనే అభిలాష, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయాలన్న కసి ఉండడం సహజం. కానీ మహీధర్‌ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యే, ఒక సారి మంత్రి అయినా.. ప్రతి సారి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే మాదిరిగా ప్రజా సమస్యలు తీర్చాలని, నియోజకవర్గంలో శాశ్వత ప్రాతిపదికన ఉండే అభివృద్ధి పనులు చేయాలనే తపన కనిపిస్తుంది. ఆ క్రమంలోనే నిత్యం అధికారులతో సమీక్షలు, గ్రామ స్థాయి నేతలతో మంతనాలు సాగిస్తుంటారు.

చౌదరి సామాజికవర్గం బలంగా ఉండే కందుకూరు నియోజకవర్గంలో మహీధర్‌ రెడ్డి బలమైన నేతగా ఎదగడానికి ప్రధాన కారణం నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడమే. అందుకే 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నా.. 2019 ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్‌ ఆయను వరించింది. తాజాగా ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం నడుం బిగించారు. జనవరి నెల నుంచి కందుకూరు పట్టణంలో ఇంటింటికి వెళ్లాలని మహీధర్‌ రెడ్డి నిర్ణయించుకున్నారు. ప్రజల సమస్యలను వారి ఇళ్ల ముంగిటే పరిష్కరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మహీధర్‌ రెడ్డి నిర్వహించబోతున్నారు. వార్డు సచివాలయ సిబ్బంది, ఇతర విభాగాల అధికారులను ఆయన వెంట సాగనున్నారు. 2019 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కనీసం ఒకసారైన ఆయన వెళ్లారంటే.. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో అర్థం చేసుకోవచ్చు.

అభివృద్ధిలో మహీధర్‌ రెడ్డి తనతో తానే పోటీ పడతారని అక్కడ అధికారులు వ్యాఖ్యానిస్తుంటారు. జిల్లాకు ఏ విభాగానికి ఎంత నిధులు వచ్చాయి..? ఏ ఏ అభివృద్ధి ప్రాజెక్టులు రాబోతున్నాయనే సమాచారం.. అయనకు ఇతర ప్రజా ప్రతినిధుల కన్నా ముందే తెలుస్తుంది. ఆ స్థాయిలో ఆయన నెట్‌వర్క్‌ కలిగి ఉన్నారు. జిల్లాకు వచ్చిన నిధులను దృష్టిలో ఉంచుకుని.. ఆ దిశగా తన నియోజకవర్గంలోని అధికారులతో అంచనాలు రూపాందించి.. కలెక్టర్‌ ముందు పెట్టి ఆయన్ను ఆశ్చర్యానికి గురిచేయడం మహీధర్‌ రెడ్డి నైజం. కందుకూరు నియోజకవర్గంలో ఉన్న ఏకైక ఇరిగేషన్‌ ప్రాజెక్టు రాళ్లపాడు సామర్థ్యం పెంపు కోసం మహీధర్‌ రెడ్డి నిత్యం పని చేస్తున్నారు. అటు సోమశిల నీటిని రాళ్లపాడుకు తీసుకువచ్చేందుకు కాలువ తవ్వించారు. రాళ్లపాడులో నీటి లభ్యత పెరగడంతో ఆ మేరకు ఆయకట్టును పెంచేందుకు ఇటీవల దాదాపు 640 కోట్ల రూపాయలతో కాలువ నిర్మాణానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేత వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేయించారు.

కందుకూరు పట్టణం మినహా.. కుందుకూరు గ్రామీణం, గుడ్లూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, ఉలవపాడు మండలాలన్నీ వ్యవసాయ ఆధార ప్రాంతాలే కావడంతో.. మహీధర్‌ రెడ్డి సాగునీటి వనరుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కందుకూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో చెరువు ఉండడం, వాటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడడం వ్యవసాయానికి మహీధర్‌ రెడ్డి ఇచ్చే ప్రాధాన్యతన తెలియజేస్తోంది. వాగులు, వంకలపై చెక్‌డాంలు పదుల సంఖ్యలో నిర్మించారు. ఇప్పటి వరకూ వ్యవసాయమే జీవానాధారంగా ఉన్న కందుకూరు నియోజకవర్గానికి.. త్వరలో రామాయపట్నం పోర్టు ద్వారా పారిశ్రామిక కల రాబోతోంది. అటు ప్రజా సమస్యలు, ఇటు అభివృద్ధి పనులలో.. మహీధర్‌ రెడ్డి నూతన ఎమ్మెల్యేలకు అదర్శంగా నిలుస్తున్నారు. తొలి సారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు మహీధర్‌ రెడ్డి నుంచి సలహాలు కూడా స్వీకరిస్తుండడం ఆయన పనితీరుకు నిదర్శనం.

Read Also : పంచాయతీ పోరు.. నిమ్మగడ్డ మరో అడుగు..!

Show comments