Idream media
Idream media
రెండున్నరేళ్ల పాలనలో సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రగామి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మిగిలిన పాలనలో కూడా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టే ప్రయత్నాల్లో వేగంగా అడుగులు వేస్తున్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి అత్యధిక కేటాయింపులు చేసి ఇప్పటికే అందరి దృష్టినీ జగన్ ఆకర్షిస్తున్నారు. సామాజిక సమానాభివృద్ధికి బాటలు వేశారు. ఇప్పుడు సుస్థిరాభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం ఆర్థిక ఒడిదుడుకులు లేకుండా, ఆటుపోట్లు ఎదురైనా సుస్థిరంగా నిలదొక్కుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
తొలి నుంచీ జగన్ గతానికి భిన్నంగానే పాలన కొనసాగిస్తున్నారు. ఎవరూ ఊహించని రీతిలో ప్రజల్లో ఆదరణ పొందుతున్నారు. దీంతో విపక్షాలు మిగిలిన కాలంలోనే ఏదో ఒకటి చేసి జగన్ ఆదరణను తగ్గించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.
ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అయితే.. సింపతీ రాజకీయాలకు తెర తీసింది. ప్రజల నుంచి సానుభూతి పొందడం.. తద్వారా లభించే ఓట్లతో అధికారంలోకి రావాలనే ఎత్తుగడలో ఉంది. విపక్షాల ఎత్తుగడలు ఇలా ఉంటే.. జగన్ మాత్రం తనదైన మార్క్ కొనసాగిస్తున్నారు. జగనన్న కాలనీలు, సంపూర్ణ గృహ హక్కు, టిడ్కో ఇళ్లు.. ఇలా ప్రజలకు స్థిరాస్తుల కల్పనపై దృష్టి సారిస్తున్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన వైపు అడుగులు వేస్తున్నారు. అధికారులకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తూ.. ఆటంకాలను అధిగమించేలా స్వయంగా సమీక్షలు జరుపుతున్నారు.
Also Read : ఆంధ్రప్రదేశ్ విభజన హామీలపై పార్లమెంట్ లో గళం విప్పిన వైఎస్సార్సీపీ నేత
దీంతో పాటు విపక్షాల ఎత్తుగడలను తిప్పికొడుతూ.. ఓటీఎస్ ను దిగ్విజయంగా నడిపిస్తున్నారు. రుణాలు పొంది ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో, సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న పలువురు నేటికీ పత్రాలు పొందలేక దశాబ్దాలు తరబడి ఇబ్బంది పడుతున్న పేదల కళ్లల్లో ఆనందం నింపుతున్నారు. వేలల్లో ఉన్న రుణాల్ని కొద్ది మొత్తంలో చెల్లింపులు చేస్తే చాలు.. రిజిస్ట్రేషన్ చేసి పత్రాలను అందించడం ద్వారా వారికి సకల హక్కులతో స్థిరాస్తి భాగ్యం కల్పిస్తున్నారు.
అభివృద్ధే ఎజెండా నిత్యం అన్నిశాఖల అధికారులతో చర్చిస్తూ.., స్థానిక అవసరాలకు అనుగుణంగా మంత్రులను భాగస్వామ్యులను చేయడం ద్వారా ఏపీలో బ్రేకులు పడకుండా సంక్షేమ బండి దూసుకుపోతోంది. ఏదేనీ పథకం ప్రకటించాం.. అందించాం.. అని అంతటితో వదిలేయకుండా ఆ పథకం లక్ష్యాలు, ఫలితాలు ఎలా ఉంటున్నాయో నిశితంగా పరిశీలిస్తున్నారు.
పరిధిని పొడిగించుకుంటూ పోతూ, లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగితే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అన్నింటినీ ఎదుర్కొంటూ సుస్థిర అభివృద్ధి సాధించడంపైనే జగన్ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అభివృద్ధితో అన్నింటినీ అధిగమించగలమని ధృఢంగా నమ్ముతున్నారు. ప్రతీ పేద కుటుంబానికి సుమారు పది లక్షలకుపైగా స్థిరాస్తి ఉండేలా కంకణం కట్టుకున్నారు. దాంతో పాటు కావాల్సిన వనరులపైనా దృష్టి పెడుతూ ముందుకు సాగుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్.
Also Read : పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్.. నూతన సంవత్సర కానుక ప్రకటించిన జగన్..