ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్‌ రోవర్‌.. వీడియో వైరల్‌

42 రోజుల నిరీక్షణ ఫలించింది. ఇస్రో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. అంతరిక్ష పరిశోధనలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. చంద్రయాన్‌ 3 విజయంతో సరికొత్త రికార్డు సృష్టించింది. జాబిల్లి దక్షిణ ధ్రువం మీద అడుగుమోపిన తొలి దేశంగా ఇండియా రికార్డ్‌ సృష్టించింది. బుధవారం సాయంత్రం 6.03 గంటలకు చంద్రయాన్‌ 3 చంద్రుడి మీద అడుగుపెట్టింది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగిన కొద్ది గంటల తర్వాత ప్రజ్ఞాన్ రోవర్‌ బయటకి వచ్చింది. ల్యాండింగ్ జరిగిన నాలుగు గంటల తర్వాత విక్రమ్ ల్యాండర్ బయటకు రావడంతో.. ఇస్రో చేపట్టిన ప్రయోగం పరిపూర్ణం అయ్యింది. ప్రజ్ఞాన్‌ రోవర్‌.. చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా అడుగుపెట్టింది.

చంద్రయాన్‌ 3 ప్రయోగంలో రోవర్‌ కీలక పాత్ర పోషించనుంది. చందమామ మీద రహస్యాలను చేధించే ప్రయోగంలో కీలకంగా వ్యవహరించే ప్రజ్ఞాన్‌ రోవర్‌ సెకనుకు ఒక్క సెం.మీ వేగంతో ల్యాండర్‌ ర్యాంపు ద్వారా బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన విజువల్స్‌, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. రోవర్‌ బయటకు వచ్చి చాలా సేపే అవుతున్నా.. ఇస్రో మాత్రం గురువారం ఉదయం దీని గురించి ట్వీట్‌ చేసింది. రోవర్‌ ప్రగ్యాన్‌ ల్యాండర్‌ నుంచి కిందకు దిగి.. చంద్రుడిపై ప్రయాణం ప్రారంభించిందని ప్రకటించింది ఇస్రో. చంద్రుని కోసం ఇండియాలో తయారైన రోవర్‌ అంటూ ట్వీట్‌ చేసిన ఇస్రో.. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తామంది.

ప్రజ్ఞాన్‌ రోవర్‌ బయటకు వచ్చినట్లు.. ఇస్రో గురువారం ఉదయం ప్రకటించింది. కానీ అందుకు కొన్ని గంటల క్రితమే.. ల్యాండర్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటికి వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు ఇస్రో కమాండ్ సెంటర్ నుంచే బయటికి వచ్చినట్లుగా తెలుస్తోంది. చంద్రుడికి సంబంధించిన సమాచారాన్ని రోవర్‌ ప్రజ్ఞాన్‌ సహాయంతో ల్యాండర్‌ ద్వారా ఇస్రోకు చేరనుంది. 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలాన్ని ప్రజ్ఞాన్‌ పరిశోధించనుంది.


Show comments