మంగళగిరిలో నూతనంగా నిర్మించి ఇటీవలే ప్రారంభించిన టిడిపి జాతీయ కార్యాలయానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ప్రభుత్వ భూమిని (వాగు పోరంబోకు) ఆక్రమించారంటూ మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణ రెడ్డి వేసిన ప్రజా ప్రయోజన వాజ్యం పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణకి ఆదేశించింది ఈ మేరకు ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2016 జులై 21న నూతన రాజధాని అమరావతిలో మరియు జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం రాజకీయ పార్టీలకు భూ కేటాయించడానికి ఉద్దేశించిన ల్యాండ్ అలాట్మెంట్ చట్టాన్ని సవరిస్తూ కొత్త జోవో జారీ చేసింది (GO Ms No 571) అయితే అప్పట్లోనే దీని మీద, చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలోచ్చాయి. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఇది కేవలం అప్పటి అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగ రూపొందించారని పెద్దఎత్తున విమర్శలోచ్చాయి.
దీనికి ముఖ్య కారణం ప్రభుత్వం రాజకీయపార్టీల భూ కేటాయింపులకు రూపోందించిన మార్గదర్శకాలు వివాదాస్పదంగా ఉండటం. కొత్త రూల్ ప్రకారం రాజకీయ పార్టీలను వాటి సభ్యుల సంఖ్య అసెంబ్లీలో ఆయా పార్టీల ప్రాతినిధ్యం ఆధారంగా 3 కేటగిరీలుగా విభజించారు. కేటగిరి-1 ప్రకారం రాజకీయ పార్టీలలో ఎవరైతే అప్పటి ఉభయ సభల్లోని మొత్తం సభ్యుల్లో 50% పైన ప్రాతినిధ్యం కలిగి ఉన్నారో వారికి 4 ఎకరాలు, కేటగిరి-2 ప్రకారం అప్పటి సభలో మొత్తం సభ్యుల్లో 25-50% మధ్య ప్రాతినిధ్యం కలిగి ఉన్న రాజకీయ పార్టీలకు అర ఎకరం, కేటగిరి 3 క్రింద అప్పటి సభలోని మొత్తం సభ్యుల్లో 25% కన్నా తక్కువ ప్రాతినిధ్యం కలిగి ఉన్న రాజకీయ పార్టీలకు కేవలం వెయ్యి చదరపు గజాల స్థలాన్నిమాత్రమే కేటాయించారు.
దీని ప్రకారం104 మంది శాసనసభ్యులున్న అప్పటి అధికార తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా 4 ఎకరాలు, 67 మంది శాసనసభ్యులున్న ప్రతిపక్ష వైకాపా కి ఒక ఎకరం మరియు సభలో 25% కన్నా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న మిగతా కాంగ్రెస్, బిజెపి, సిపిఐ, సిపిఐఎం లకు శాసనసభ మరియు శాసన మండలిలో ఉన్న ప్రాతినిధ్యం ఆధారంగా కేవలం 1000 చదరపు గజాలు స్థలం 99 సంవత్సరాల పాటు ఎకరానికి 1000 చొప్పున కేటాయించారు. అయితే ఇది అసలు రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన వైఎసార్సీపి చంద్రబాబు ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రాజధాని పేరు చెప్పి అమాయక రైతుల దగ్గర నుండి విలువైన భూములని బలవంతంగా లాక్కొని రాజకీయ పార్టీలకు భూములు కేటాయించడం దేశంలో ఎక్కడా లేదని ఆరోపించింది.
ఈ భూ కేటాయింపు చూస్తే ఇది కేవలం తెలుగుదేశానికి లబ్ది చేకూర్చడాని మాత్రమేనని ఎవ్వరికైనా అర్ధం అవుతుంది. కారణం ఏంటంటే రాజకీయాల్లో ఒకసారి వచ్చిన ఫలితాలు ఇంకోసారి రావు కదా? చట్టసభల్లో సభ్యులేమి శాశ్వతం కాదు కదా?? మరి అలాంటప్పుడు కేవలం ఒక సభలో ఉన్న సంఖ్య ఆధారంగా భూకేటాయింపులు చేయడం ఏంటీ?? ఇస్తే అందరికి సమానంగా ఇవ్వాలి కానీ. ఆలెక్కన ఇప్పటి శాసన సభలో సభ్యుల సమాఖ్య ఆధారంగా తెలుగుదేశానికి 1000 చదరపు గజాలు కూడా రాదు కదా ?? అలాంటిది 99 ఏళ్ళ పాటు ఖరీదైన 4 ఎకరాల ప్రభుత్వ భూమిని పార్టీ గుప్పెట్లో పెట్టుకోవడం ఏంటీ ?? దీనిని ఏమంటారు ?? ఇలానే గతంలో ఇదే చంద్రబాబు హాయంలో హైదరాబాద్ నగరం నడిబొడ్డున జూబ్లీహిల్స్ లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి ఇదే రీతిలో అక్రమంగా వందల కోట్ల రూపాయల విలువైన భూమిని కేటాయించారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో రామారావు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఉభయ సభల్లో సభ్యుల ప్రాతినిధ్యంతో పనిలేకుండా ప్రధాన పార్టీలకన్నింటికీ ఒక్కో ఎకరం చొప్పున 30 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చిన సంగతి మనకి తెలిసిందే!
ఇది ఇలా ఉంటే రాజధానిలో గత ప్రభుత్వ పెద్దల భూ భాగోతాల మీద మంగళగిరి శాసనసభ్యులు గత కొన్ని సంవత్సరాలుగా న్యాయస్థానాల్లో ఒంటరిగా పోరాడుతూనే ఉన్నాడు. పైగా రామకృష్ణా రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి జాతీయ రహదారి పక్కన కేటాయించిన 4 ఎకరాల స్థలంలో కొంత భూమి వాగు పోరంబోకు కిందకి వస్తుందని మిగతా భూమిలో ఎకరంన్నర భూమిని ఒక రైతు నుండి బెదిరించి లాకొన్నారని రెండు సంవత్సరాల నుండి చెప్తూనే వున్నారు. దీనిమీద ఇప్పటికే హైకోర్టు లో కేసు నడుస్తుంది. కాగా ఆళ్ల రామకృష్ణ రెడ్డి గారు వేసిన ప్రజా ప్రయోజనం వాజ్యం పై ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణకి ఆదేశించి, ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దీనిపై తెలుగుదేశం పార్టీ ఇంతవరకు అధికారికంగా స్పందించకపోవడం విశేషం.