Idream media
Idream media
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి బలంగా ఉన్న నేపథ్యంలో వైరస్ కట్టడికి ఒక్కొక్క రాష్ట్రం లాక్‌డౌన్ దిశగా పయనిస్తున్నాయి. సెకండ్ వేవ్‌లో ఢిల్లీ రాష్ట్రం మొదటిసారి లాక్‌డౌన్ ప్రకటించగా.. ఆ బాటలోనే కర్ణాటక నడిచింది. వీటి సరసన ముచ్చటగా మూడో రాష్ట్రం చేరింది. తమ రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు గోవా ప్రభుత్వం ప్రకటించింది. రేపు రాత్రి 10 గంటల నుంచి మే 3వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయబోతున్నట్లు తెలిపింది. అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.
దేశంలో రోజు వారీ కేసుల నమోదు 3.60 లక్షలకు దాటుతున్నాయి. ఢిల్లీలో 25–30 వేల మధ్య, కర్ణాటకలో 30–35 వేల మధ్య రోజు వారీ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదట గత సోమవారం ఆరు రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన ఢిల్లీ.. మళ్లీ దాన్ని మే 3వ తేదీ వరకు పొడిగించింది. ఇక కర్ణాటక రెండు వారాల పాటు లాక్‌డౌన్ విధించింది. ఈ తరహాలోనే గోవా కరోనా కట్టడికి లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ మూడు రాష్ట్రాలే కాదు.. మరికొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ బాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. విధించిన లాక్‌డౌన్‌లు మళ్లీ ఎప్పుడు ఎత్తివేస్తారన్నది కేసులు తగ్గుముఖం పట్టే దానిపై ఆధారపడి ఉంటుంది. కేసులు తగ్గుముఖం ఎప్పుడు పడతాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
Also Read : నియంత్రణ మీ చేతిలో లేదు ముఖ్యమంత్రి గారు..!
కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ అంశాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సొంత నిర్ణయాలకు వదిలేసింది. గత ఏడాది తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాలు మార్చి 25వ తేదీన లాక్‌డౌన్ ప్రకటించగా.. ఆ తర్వాత రెండు రోజులకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పుడు కూడా గత ఏడాది పరిస్థితులే కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. లాక్‌డౌన్ అమలు చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మే 2వ తేదీన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత.. ఏ క్షణమైనా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటిస్తుందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ లోపు ఒక్కొక్క రాష్ట్ర లాక్‌డౌన్ బాటపడుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాలతో రాకపోకలను నిషేధిస్తున్నాయి. అయితే ఇది ఎంత వరకు ఫలితాన్ని ఇస్తుందనేది ప్రశ్న. మళ్లీ లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత వైరస్ వ్యాప్తి కాదన్న గ్యారెంటీ లేదు. అందుకే సుప్రిం కోర్టు అన్నట్లుగా.. మహమ్మారిని ఎదుర్కొనేందుకు జాతీయ ప్రణాళిక ఉండాలి. ఈ దిశగా కేంద్ర వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.
Also Read : కరోనా సునామీ : మరో రాష్ట్రంలో లాక్‌డౌన్