రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ప్రకటించిన ఏపీ సర్కార్‌

ఏలూరు జిల్లాలోని మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ పరిశ్రమలో ఔషధాల తయారీలో వాడే పొడి ఉత్పత్తి చేస్తున్నారు. రసాయన పరిశ్రమలోని నాలుగో యూనిట్ లో మంటలు చెలరేగి రియాక్టర్ పేలింది. దీంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో యూనిట్‌లో 150 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. భారీ పేలుడుతో మంటలు చెలరేగడంతో అక్కడిక్కడే ఐదుగురు సజీవదహనమయ్యారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు బీహార్‌ వాసులు ఉన్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న అధికారులు ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దింపారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. చక్కెర కర్మాగారాన్ని రసాయన కర్మాగారంగా మార్చారని, సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని వాపోతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా కంపెనీ యాజమాన్యం స్పందించలేదని, కనీసం 108కి కూడా ఫోన్‌ చేయలేదని మండిపడుతున్నారు. బాధిత కుటుంబాల వారికి న్యాయం చేయాలంటూ కార్మికులు కంపెనీ ఎదుట ఆందోళన చేస్తున్నారు. పరిశ్రమను అక్కడ నుంచి మరోచోటకు తరలించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే మేకాప్రతాప్‌ వెంకట అప్పారావు పరిశీలించారు.

సీఎం దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన..

అగ్రిప్రమాద ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Show comments