iDreamPost
iDreamPost
మంత్రి ఈటల రాజేందర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన వద్ద ఉన్న వైద్య ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ కు బదిలీ అయింది. ఇన్నాళ్లు పొగబెట్టిన సర్కారు.. ఇక ఆయన్ను సాగనంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పొగ సెగ తమకు తగులుతోందని కొందరు నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈటలపై ఆరోపణలు వస్తే.. అందరూ తమను టార్గెట్ చేస్తున్నారని గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న నేతలు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాయి.
ఫామ్ హౌస్ విషయంలో కేసీఆర్ కొడుకు, మంత్రి కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొన్నారని, మరి ఆయనపై విచారణకు ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నిస్తున్నాయి. మంత్రులు గంగుల కమలాకర్, చామకూర మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస గౌడ్, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రసమయి బాలకిషన్‌పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయిని, మరి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీస్తున్నాయి. దీంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
వాళ్లపై ఎందుకు విచారణ చేపట్టరు?
కేసీఆర్ కేబినెట్లో సగమందికి పైగా మంత్రులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, మరి వారిపై విచారణ ఎందుకు జరపరని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో అధికార పార్టీ లీడర్లు అక్రమాలకు పాల్పడ్డారని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీస్తున్నాయి. మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకున్నారని, మల్లారెడ్డిపై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నాయని, అక్రమంగా భూములు కబ్జా చేసిన మంత్రి గంగుల కమలాకర్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి విషయంలో సీఎం కేసీఆర్ కనీసం స్పందించలేదని చెబుతున్నాయి. వీరంతా సీఎం కేసీఆర్‌కు కావాల్సిన వాళ్లని, అందుకే వాళ్లు ఏం చేసినా చెల్లుతుందని ఆరోపిస్తున్నాయి. తెలంగాణలో రెండు రకాల అవీనితి ఉందని.. నచ్చిన అవినీతి.. నచ్చని అవినీతి జరుగుతోందని మండిపడుతున్నాయి.
కేటీఆర్ ఫామ్ హౌస్.. అప్పటిదాకా ఎవరికీ తెలియదు..
కేటీఆర్ ఫామ్ హౌస్ అంశాన్ని గతేడాది ఎంపీ రేవంత్ రెడ్డి లేవనెత్తారు. గండిపేట చెరువుకు వెళ్లే దారిలో అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని ఆరోపించారు. నిజానికి అప్పటిదాకా కేటీఆర్ కి ఫామ్ హౌస్ ఒకటి ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. డ్రోన్ కెమెరాలను ఉపయోగించి ఫొటోలు, వీడియోలు తీశారు. కేటీఆర్ గెస్ట్ హౌస్ ఉన్న ప్రాంతంలో డ్రోన్ కెమెరాలకు అనుమతి లేదన్న కారణంతో.. అప్పుడే కొందరిపై కేసులు బుక్ చేశారు. ఇందులో ఏ-1గా రేవంత్ రెడ్డిని పోలీసులు చేర్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని, 111 జీవోను అతిక్రమించి కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని రేవంత్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు తుంగలో తొక్కి 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ లీడర్లతో కలిసి రేవంత్ ఫామ్ హౌస్ ముట్టడి కార్యక్రమం కూడా చేపట్టారు. తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్, హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇప్పుడు ఈటలపై ఆరోపణలు రావడంతో కేటీఆర్ ఫామ్ హౌస్ అంశాన్ని లీడర్లు లేవనెత్తుతున్నారు.
Also Read : ఆపరేషన్ ఈటల.. మరో కీలక పరిణామం
ముత్తిరెడ్డి.. చెరువు భూమిని కబ్జా చేశారంటూ..
వివాదాల్లో ముందుంటారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. గతంలో పలు ఆరోపణలు ఆయనపై వచ్చాయి. చేర్యాలలో పెద్ద చెరువు మత్తడి స్థలాన్ని యాదగిరి రెడ్డి కబ్జా చేశారని ఆరు నెలల కిందట ఆరోపణలు వచ్చాయి. అర ఎకరం స్థలాన్ని ఆక్రమించారని స్థానిక నేతలు ఆరోపించారు. మత్తడి నుంచి నేరుగా కాలువ నిర్మిస్తే తన కుమార్తె కొన్న స్థలం మొత్తం కాలువకు వదలాల్సి ఉంటుందనే ఉద్దేశంతో కాస్త పక్కకు జరిపి కాలువను ముత్తిరెడ్డి డిజైన్ చేయించారని వార్తలు వచ్చాయి. అంతకుముందు ఓ వివాదాస్పద 6 ఎకరాల స్థలంలో ఆయన వెంచర్ వేశారు. మున్సిపల్ నాలాకు అడ్డంగా వెంచర్ వేసి మురుగు నీటిని పక్కనున్న వాగులోకి తరలించే యత్నం చేశారని స్థానికులు ఆరోపించారు. 2017లో కూడా జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో అర ఎకరం భూమిని యాదగిరి రెడ్డి కబ్జా చేశారని కలెక్టర్ దేవసేన ప్రకటన చేయడం కలకలం రేపింది.
మల్లారెడ్డిపై ఎన్నో ఆరోపణలు
మొన్నటికి మొన్న రియల్ ఎస్టేట్ వ్యాపారిని మంత్రి మల్లారెడ్డి బెదిరించిన ఆడియో లీక్ అయింది. తనకు ఇవ్వాల్సింది ఎవరు ఇస్తారంటూ ఆయన బెదిరించడం, ఆ ఆడియో కాస్తా వైరల్ కావడంతో అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మంత్రి మల్లారెడ్డికి చెందిన ఇంజినీరింగ్ కాలేజీ.. న్యాక్ నుంచి మెరుగైన గ్రేడ్ కోసం నకిలీ సర్టిఫికెట్ సృష్టించిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో మల్లారెడ్డికి చెందిన ఇంజినీరింగ్ కాలేజీకి నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ గట్టి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ కొంపల్లిలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీపై ఏకంగా ఐదేళ్లు బ్యాన్ విధించింది. ఈ విషయాన్ని న్యాక్ తన అధికారిక వెబ్‌సెట్ ద్వారా ప్రకటించింది.
అంతకుముందు దివంగత మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి కూడా సంచలనలు ఆరోపణలు చేశారు. మల్లా రెడ్డి కార్మిక శాఖ మంత్రిగా ఉంటూనే కార్మికుల పొట్టకొట్టడంతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరించారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాచారంలోని లిక్కర్ ఇండియా కంపెనీ యాజమాన్యం వద్ద డబ్బులు తీసుకుని అదే కంపెనీలో పనిచేస్తున్న 9 మంది కార్మికుల పొట్టగొట్టారని మల్లారెడ్డిపై విమర్శలు చేశారు. ఓ మహిళకు చెందిన భూమిని ఆక్రమించారనే ఆరోపణలపై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో మల్లారెడ్డిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తన భూమిని రిజ్రిస్టేషన్ చేయించాలంటూ మంత్రి బెదిరిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది.
గంగుల కమలాకర్ గ్రానైట్ బిజినెస్ లో అక్రమాలు చేశారంటూ గతంలో గ్రీన్ ట్రిబ్యూల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. కరీంనగర్ సరిహద్దుల్లో 15 ఎకరాల వక్స్ బోర్డ్ భూమిని గంగుల కమలాకర్ ఆక్రమించుకునే యత్నం చేశారని కాంగ్రెస్ నేతలు గతంలో ఆరోపించారు. తాను కొన్న 15 ఎకరాల భూమిని ధరణి పోర్టల్ చేర్చలేదంటూ సొంత సర్కారు మీదనే గంగుల హైకోర్టుకు వెళ్లారు.
తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు ఏర్పాటైన కొత్తలో సాంస్కృతిక సారథులను నియమించారు. తెలంగాణ సాంస్కృతిక సారథికి చైర్మన్ గా ఉన్న రసమయి బాలకిషన్.. పోస్టులను అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇష్టమున్నవాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారనే విమర్శలు వచ్చాయి. అప్పట్లో ఆయా నియామకాలను రద్దు చేసిన హైకోర్టు.. మళ్లీ అర్హులను నియమించాలని ఆదేశాలిచ్చింది.
Also Read : ఈటల.. తెగే దాకా లాగారా..?