Venkateswarlu
Venkateswarlu
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. పెట్రోల్ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. తక్కువ ధర ఉండటం.. తక్కువ ఖర్చు ఎక్కువ దూరం ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజు రోజుకు పెరుగోతంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాల కారణంగా తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ విచ్చల విడిగా పేలుతున్నాయి. దీని కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు.
తాజాగా, హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ పేలి ఓ ఇళ్లు కాలి బూడిదైంది. దాదాపు 4 లక్షల ఆస్తి నష్టం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్ ముసారంబాగ్‌లోని ఇందిరానగర్‌కు చెందిన మహేష్ అనే వ్యక్తికి ఎలక్ట్రిక్ వాహనం ఉంది. అతడు ప్రతీ రోజు రాత్రి లేదా తెల్లవారుజామున వాహనం బ్యాటరీకి ఇంట్లోనే ఛార్జింగ్ పెడుతూ ఉంటాడు. గురువారం తెల్లవారు జామున కూడా బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాడు. కొంత సమయం తర్వాత ఊహించని విధంగా బ్యాటరీలోంచి మంటలు మొదలయ్యాయి. ఆ మంటల కారణంగా షార్ట్ సర్క్యూట్ కూడా జరిగింది. షార్ట్ షర్క్యూట్ కారణంగా ఇళ్లు మొత్తం మంటల్లో కాలిపోయింది.
ఇంట్లోని ఫ్రిడ్జ్, టీవీ, బీరువా, బట్టలు, ఇతర సామాన్లు కూడా కాలిబూడిదయ్యాయి. కుటుంబసభ్యులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పి వేశారు. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. ఇక, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న మలక్‌పేట్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరి, ఈ మధ్య కాలంలో టపాసుల్లా పేలుతున్న ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.