TDP, 2019 Defeat, MP Ram Mohan Naidu – అంతగా భయపడ్డారా..? రామ్మోహన్‌ ఏం చెప్పదలుచుకున్నారు..?

2019 ఎన్నికల తాలూకు ఘోర ఓటమి నుంచి టీడీపీ శ్రేణులు ఇంకా బయటపడినట్లుగా కనిపించడం లేదు. ఆ ఎన్నికల్లో ఊహించని విధంగా టీడీపీ బొక్కబోర్లా పడింది. 175 సీట్లకు గాను 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ.. చరిత్ర సృష్టించింది. ఈ విజయాన్ని చూసిన టీడీపీ శ్రేణులు.. ఇక సమీప భవిష్యత్‌లో టీడీపీకి అధికారం దక్కడం కల్ల అనే అభిప్రాయానికి వచ్చారు. ఈ ఫలితాలకు తోడు.. గడచిన రెండున్నరేళ్లలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సాగించిన పరిపాలన సంస్కరణల, సంక్షేమ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టినట్లు స్థానిక ఎన్నికల ఫలితాలు చాటిచెప్పాయి. దీంతో టీడీపీ నేతలు కూడా భవిష్యత్‌పై ఆశలు వదిలేసుకున్నారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ మళ్లీ అధికారంలోకి రాలేదని, పార్టీ బాధ్యతలు జూనియర్‌ ఎన్టీఆర్‌కు అప్పజెప్పాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.

ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులకు భవిష్యత్‌పై ఆశలు కల్పించేందుకు ఆ పార్టీనేతలు నానా తంటాలు పడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ సర్వసభ్య సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ఉన్న పరిస్థితికి అద్దం పడుతోంది. 2019 ఎన్నికల తాలూకూ ఓటమి నుంచి ఆ పార్టీ శ్రేణులను భయటపడేసేందుకు రామ్మోహన్‌ నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చన్నారు. చంద్రబాబు కుటుంబాన్ని అసెంబ్లీలో అవమానించినా ధీటుగా ఎదుర్కొన్నామన్నారు. వైసీపీకి టీడీపీ భయపడే రోజులు పోయాయని, ఇప్పుడు వైసీపీ భయపడే రోజులు వచ్చాయని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 151 సీట్లకు పైగా రావాలన్నారు. టీడీపీ జెండాను చూస్తే వైసీపీ నేతల గుండెళ్లో రైళ్లు పరిగెట్టాలని వ్యాఖ్యానించారు. ఈ తరహాలో మాట్లాడిన రామ్మోహన్‌ నాయుడు.. మళ్లీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందంటూ మాట్లాడి.. ఇప్పటి వరకు తాను చెప్పినదంతా ఒట్టిదేననేలా తుస్సుమనిపించారు. 

సాధారణ ఎన్నికలు ముగిసి దాదాపు మూడేళ్లు కావస్తోంది. సాధారణంగా అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కానీ వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో రోజురోజుకి సానుకూలత పెరుగుతోంది. కరోనా వైరస్‌ వల్ల రెండు సంవత్సరాల పాటు జనజీవనం అస్తవ్యస్తమై, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక కష్టాలు లేకుండా.. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసింది. నగదు బదిలీ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో 1.16 లక్షల కోట్ల రూపాయలు జమ చేసింది. అర్హతే ఆధారంగా పథకాలు అందజేయడంతో.. టీడీపీ సానుభూతిపరులు కూడా అధికార పార్టీ పట్ల సానుకూలంగా ఉంటున్నారు.

Also Read : టీడీపీ ‘రెక్కీ’ రాజ‌కీయం..!

ఈ పరిస్థితిని మార్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. చివరికి సానుభూతి కోసం.. తన భార్యను.. అసెంబ్లీలో అవమానించారంటూ వెళ్లిన ప్రతి చోటా చెప్పుకుంటున్నారు. అయినా చంద్రబాబు ఆశించిన ఫలితం దక్కకపోగా.. స్వప్రయోజనాల కోసం మహిళలను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారనే అపప్రథను మూటగట్టుకున్నారు. అందుకే ఇప్పుడు రామ్మోహన్‌ నాయుడు లాంటి వారు పై విధంగా వ్యాఖ్యలు చేస్తూ.. నష్టనివారణ చర్యలు చేపడుతున్నారు.

Show comments