పనబాక కనపించరేంటి?

  • Published - 07:22 AM, Wed - 17 March 21
పనబాక కనపించరేంటి?

మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో, నిన్న మున్సిపల్ ఎన్నికల విషయంలో అవమాన భారం ఎదుర్కొని దీనం గా ఉన్న తెలుగు తమ్ముళ్లకు త్వరలో మరో అవమానభారం తప్పేలా కనిపించడం లేదు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున బరిలో నిలుస్తానని ప్రకటించిన పనబాక లక్ష్మి తీరు మొదటినుంచి అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. తాజాగా వచ్చిన ఫలితాలతో ఆమె పోటీకి పూర్తిగా వెనకడుగు వేసినట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఆమె పోటీకి నో అంటే కనుక అది టీడీపీకి తీరని అవమానం కిందే లెక్క.

తొందర పడ్డారా?

తిరుపతి ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థిగా నవంబర్ 16వ తేదీన చంద్రబాబు నెల్లూరు నేత, 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన పనబాక లక్ష్మి పేరు ప్రకటించారు. అప్పటికి తిరుపతి ఉప ఎన్నిక మీద ఎలాంటి స్పష్టత లేక పోయినప్పటికీ అన్ని పార్టీల కంటే ముందే ఆయన పనబాక పేరును ప్రకటించి దానికి తగినట్లుగా టీడీపీ శ్రేణులను సన్నద్ధం చేసుకోవాలని సూచించారు. వెనువెంటనే ఆడియో, వీడియో కాన్ఫరెన్స్ లను పార్టీ నేతలతో పెట్టి హడావుడి చేయాలనీ బాబు భావించారు.

ఆయన ఒకటి తలిస్తే అభ్యర్థి ఒకటి తలిచినట్లుగా పనబాక లక్ష్మి తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి విముఖత చూపారు. ఆమె పేరును అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పార్టీకి దూరం జరుగుతూ వచ్చారు. తిరుపతి వైపు చూడకుండా, కనీసం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులను, కార్యకర్తలను కలవకుండా ఆమె కొనసాగారు. టిడిపి తిరుపతి నియోజకవర్గ నాయకులు మాట్లాడాలని ప్రయత్నించిన అందుబాటులోకి రాలేదు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదులు వెళ్లాయి.

గత ఏడాది నవంబర్ చివర్లో డిసెంబర్ మొదట్లో పనబాక లక్ష్మి టీడీపీని వీడి బిజెపిలో చేరుతారని ప్రచారం జోరుగా జరిగింది. ఇప్పటికే ఆమెతో జాతీయ నాయకులు సైతం సంప్రదింపులు జరిపారని, దాదాపుగా ఆమె తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అవకాశం ఉందన్న పుకార్లు గట్టిగా వ్యాపించాయి. దీనిని పనబాక లక్ష్మి, ఆమె భర్త కృష్ణయ్య సైతం ఖండించక పోవడంతో దీనికి మరింత బలం చేకూరింది. క్రమంగా టిడిపి నాయకులను తన బాగా దూరం పెట్టడం కూడా దీనికి మరింత ఊతం ఇచ్చింది.

తిరుపతి నాయకుల దగ్గర నుంచి పదేపదే ఫిర్యాదులు రావడంతో చంద్రబాబు రంగంలోకి దిగారు. పనబాక కృష్ణయ్య తో ఫోన్లో మాట్లాడి నాయకులతో కార్యకర్తలతో సమావేశం అవ్వాలని, తిరుపతి లో అందుబాటులో ఉండాలని సూచించారు. అయితే తమ ఇంట్లో శుభకార్యం ఉందని కూతురు రచన వివాహం జరిపించాలనే కోణంలో ప్రస్తుతం ఉప ఎన్నికల్లో పాల్గొన్న లేమని ఆయన చంద్రబాబుకు స్పష్టం చేశారు. దీంతో వ్యవహారం మొదటి వస్తుందని భావించిన చంద్రబాబు తన దూతను పంపారు.

చంద్రబాబు దూతగా ఆయన మనిషి గా ఉండే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేరుగా పనబాక దంపతులను కలిసి మాట్లాడారు. అధినేత పేరును ప్రకటించిన తర్వాత వెనకడుగు వేస్తే పార్టీ ప్రతిష్టకు అది ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉందని భావించాలని, కూతురు పెళ్లి జరిగిన తర్వాతే తిరుపతి ఉప ఎన్నిక మీద దృష్టి పెట్టాలని సోమిరెడ్డి జరిపిన దౌత్యం పెద్దగా ఫలించలేదు.

పనబాక దంపతుల కుమార్తె ఏలూరు ఆర్డీవో రచన వివాహం ఈ ఏడాది జనవరిలో జరిగింది. దాని తర్వాత పనబాక లక్ష్మీ తిరుపతి వెళ్లి క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి నాయకులను కలుస్తారు అని అంతా భావించారు. అయితే ఆ తర్వాత కూడా ఆమె తీరులో ఏ మాత్రం మార్పు లేదు. ఉప ఎన్నికలు పూర్తిగా పట్టించుకోని విధంగానే ఆమె దూరంగా జరిగారు.

తాజాగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి పూర్తిగా చతికిలపడిన సమయంలో తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని పనబాక దంపతులు గట్టిగా భావిస్తున్నట్లు తెలిసింది. చంద్రబాబు ప్రాపకం కోసమే తమను పోటీ చేస్తున్నారన్న భావన వారిలో ఉంది. దీంతో పాటు రాజకీయ సన్నిహితులు కూడా తిరుపతి ఉప ఎన్నికకు ప్రస్తుత పరిస్థితుల్లో దూరంగా ఉండడమే మంచిది అని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మళ్లీ పనబాక లక్ష్మీ తీరు మొదటికి వచ్చింది.

ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని తిరుపతి కార్పొరేషన్ తో పాటు వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు మున్సిపాలిటీ లో తిరుగులేని ఆధిక్యత సంపాదించిన అధికార పార్టీను ఢీకొట్టడం ఇప్పుడు దాదాపు అసాధ్యం అనే భావన రావడంతోనే టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇప్పటివరకు పట్టణ ఓటర్లు టిడిపి పక్షాన ఉంటారని భావించిన నేతలకు సైతం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మొత్తంగా వారి ఆశలను అడియాశలు చేశాయి. దీంతో ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ కి ప్రత్యర్థి పార్టీ ఎవరినే దానిమీద స్పష్టత లేదు.

పనబాక ప్రస్తుతం టిడిపి తరఫున పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. చంద్రబాబు ఫోన్ కాల్ కు సైతం స్పందించడం లేదు అన్నది పార్టీ వర్గాల మాట. ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నిక ల్లో పనబాక లక్ష్మి పోటీ చేయడానికి సిద్ధంగా లేకపోతే, మరో ప్రత్యామ్నాయం చూడాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, వేరే పార్టీలోకి వెళ్లడానికి ఆమె ప్రయత్నిస్తున్నారని ప్రచారాన్ని మొదలు పెట్టడానికి టీడీపీ శ్రేణులు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో పనబాక రూపంలో మరో ప్రమాదం టిడిపికి పొంచి ఉందని స్పష్టం అవుతోంది.

Show comments