ఈ రోజు శాసనసభ ప్రారంభమవ గానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కార్యక్రమం పై చర్చ జరుగుతున్న సమయంలో విపక్ష తెలుగుదేశం సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చెయ్యడంతో సభలో మరోసారి గందరగోళం ఏర్పడింది. దీనితో విపక్ష సభ్యులను తమ స్థానాల్లోకి పోయి కూర్చోవాలని సభను సజావుగా జరపడానికి సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ విపక్ష సభ్యులు స్పీఎకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు కొనసాగించడంతో స్పీకర్ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విపక్ష సభ్యులు సభకు అడ్డుపడంపై స్పందించిన మంత్రి కొడాలి నాని ఈరోజు సభలో రాష్ట్రంలో కీలకమైన రైతుల సమస్యల మీద, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల మీద, రాష్ట్ర రైతాంగానికి ఆదుకోవడానికి ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా పధకం మీద చర్చ జరుగుతున్న సందర్భంలో విపక్షాలు మాటిమాటికీ సభలో ఆటంకాలు కల్పించడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ వ్యవహరిస్తున్న తీరుని తీవ్రంగా తప్పు పట్టారు. కృష్ణా జిల్లా కి చెందిన వెలగపూడి రామకృష్ణ బాబుని విశాఖ ప్రజలు మూడు సార్లు గెలిపిస్తే, వెలగపూడికి తనని ఇన్ని సార్లు గెలిపించిన విశాఖ ప్రజలపై ఏమాత్రం కృతజ్నత లేకుండా జై అమరావతి అంటూ స్పీకర్ పోడియం దగ్గర నుంచోని నినాదాలు చెయ్యడం ఏంటని ఎద్దేవా చేశారు.
ఒక పక్క ముఖ్యమంత్రి గారు వెనుకబడిన రాయలసీమకు, ఉత్తరాంధ్ర కి, ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సాగునీరు అందించడానికి ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా గోదావరి, కృష్ణా నుంచి పైకి నీటిని తరలించడానికి ఉద్దేశించిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చెయ్యడానికి కష్టపడుతుంటే, ఇవేమి పట్టించుకోని చంద్రబాబు వ్యవసాయాన్ని గాలికొదిలేసి తన స్వార్ధ ప్రయోజనాల కోసం, తన అనుచరుల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తమ సభ్యులని ఎగదోసి వారిచేత నినాదాలు చేయిస్తూ సభలో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్ష నాయకుడిపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.