Idream media
Idream media
అంతర్జాతీయ క్రికెట్ లో టీం ఇండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వచ్చిన తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేసుకున్నాడు. 2020-21 ఆస్ట్రేలియా టూర్ తర్వాత మనోడికి క్రేజ్ కూడా బాగా పెరిగింది. గంగూలి నుంచి పూర్తి సపోర్ట్ ఉండటంతో ఆడినా ఆడకపోయినా, క్యాచ్ పట్టినా పట్టకపోయినా సరే టీంలో ధోనీ వారసుడిగా కొనసాగుతున్నాడు. ఇక ఫాన్స్ అయితే ఇండియా గిల్క్రిస్ట్ అని చెప్పుకోవడం మొదలుపెట్టేశారు. ఏ ఫార్మాట్ అయినా సరే ఊపుడే లక్ష్యంగా బ్యాటింగ్ కు దిగడం పంత్ శైలి.
అయితే ఇప్పుడు పంత్ కు కొత్తకష్టం వచ్చింది. టీం ఇండియాలో మనోడికి ఎదురులేదనుకున్నా సరే కొన్ని కష్టాలు వెంటాడే అవకాశం ఉంది. సీనియర్ కీపర్ వ్రుద్దిమాన్ సాహా దాదాపుగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరం కావడంతో పంత్ స్థానం పదిలమైంది. అయితే ఇప్పుడు ఇషాన్ కిషన్ రూపంలో పంత్ కు గండం పొంచిఉంది. ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడటమేకాకుండా జట్టులో సుస్థిర స్థానం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. టి20 ఫార్మాట్ లో అతని ప్లేస్ దాదాపుగా ఖరారు అయింది.
అతను టి20 లలో నిలకడగా ఆడితే మాత్రం వన్డే జట్టులో తీసుకునే అవకాశం ఉంటుంది. వన్డే జట్టులో సుదీర్ఘ ఇన్నింగ్స్ లు ఆడితే మాత్రం టెస్ట్ ఫార్మాట్ లో కూడా అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. యువ ఆటగాళ్ళు ఎందరో ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ఇద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఇద్దరి వయసు దాదాపుగా ఒకటే కాబట్టి ఎవరు ఆడకపోయినా సరే పక్కనపెట్టడం పెద్ద విషయం కాదు. కాబట్టి పంత్ ఆటలో ఎంత దూకుడు ఉంటుందో అంతే నిలకడ ఉండటం అతని కెరీర్ కు మంచిది.
ప్రధాన కోచ్ ద్రావిడ్ కళ్ళల్లో పడటానికి ఇషాన్ కిషన్ ఐపిఎల్ ను టార్గెట్ గా చేసుకుని చెలరేగిపోతున్నాడు. దానికి తోడు కెప్టెన్ రోహిత్ శర్మ సపోర్ట్ కూడా కిషన్ కు ఉంది. ఈ సీజన్ లో రెండు మ్యాచ్ లు ఆడిన కిషన్ 135 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 148.35 గా ఉంది. పంత్ టాప్ 5 లో కూడా లేడు. కాని ఢిల్లీ కెప్టెన్ గా ఉన్నాడు. ఈ సీజన్ లో పంత్ ఆటను దృష్టిలో పెట్టుకునే టీం ఇండియా కోచ్ అడుగులు వేసే అవకాశం ఉంది. ఒక్కసారి రొటేషన్ పద్ధతి స్టార్ట్ అయితే మాత్రం పంత్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. ఇద్దరూ లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి ఎవరిని అయినా పక్కన పెట్టవచ్చు. ఓపెనర్ గానే కాకుండా మిడిల్ ఆర్డర్ లో కూడా రాణించడం కిషన్ శైలి.