కాంగ్రెస్ అధిష్టానంలో కీలక నేత అహ్మద్ పటేల్ కన్నుమూత, పలువురి సంతాపం

సోనియా గాంధీ అంతరంగీకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన అహ్మద్ పటేల్ మరణించారు. గుజరాత్ కి చెందిన ఈ కీలక నేత సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పారు. 71 సంవత్సరాల పటేల్ సోనియా గాంధీకి వ్యక్తిగత రాజకీయ కార్యదర్శిగా వ్యవహరించిన సమయంలో రాజకీయంగా కీలక పాత్ర పోషించారు. యూపీఏ వ్యవహారాల్లో ప్రధాన భూమిక నిర్వహించారు. తెలంగాణా ఆవిర్భావం వంటి అంశాలలో ఆయన అభిప్రాయం మూలంగా మారింది. నెల రోజుల క్రితం ఆయన కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. చివరకు బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు ఫైజల్​ ట్విటర్​ ద్వారా వెల్లడించారు. కరోనా బారిన పడి పలు అవయవాలు దెబ్బతినడంతో అహ్మద్ పటేల్ కన్నుమూశారని పేర్కొన్నారు.

ఎమర్జెన్సీ అనంతరం తొలిసారిగా 1977 పార్లమెంట్ ఎన్నికల బరిలో ఆయన నిలిచారు. ఇందిరా గాంధీ అండతో ఆయన రాజకీయ ప్రవేశం చేసి పార్లమెంట్ కి పోటీ చేశారు. 1980, 84 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ కి పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేశారు. కాంగ్రెస్ అధిష్టానంతో ఉన్న సన్నిహిత సంబంధాలతో 10జన్ పథ్ లో కీలక నేతగా ఎదిగారు. సర్థార్ సరోవర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు.

ఆ తర్వాత పూర్తిగా పార్టీ వ్యవహారాలకే ఆయన పరిమితమయ్యారు. రాజీవ్ తర్వాత సోనియా అంతరంగీకుల్లో ఒకరిగా ఎదిగారు. 2005లో యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కర్ణాటక నుంచి ఆయన రాజ్యసభ అవకాశం దక్కింది. 1949 ఆగష్ట్ 21న జన్మించిన అహ్మద్ పటేల్ తన సొంత రాష్ట్రం నుంచి లోక్ సభకు ఎన్నికయిన రెండో ముస్లీం నేత కావడం విశేషం. వీర్ నర్మదా సౌత్ గుజరాత్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందిన ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన తర్వాత ఢిల్లీకే పరిమితమయ్యారు వివిధ రాష్ట్రాల్లో సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుని కీలక నేతగా మారారు. ఆయనకు కుమారుడు ఫైజల్, కుమార్తె ముంతాజ్ ఉన్నారు.

అహ్మద్ పటేల్ మృతి పట్ల కాంగ్రెస్ సీనియర్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. పార్టీకి తీరని లోటుగా పేర్కొన్నారు. పార్టీ వ్యవహారాల్లో ట్రబుల్ షూటర్ గా వ్యవహరించిన అహ్మద్ పటేల్ వంటి నేతను కోల్పోవడం వ్యక్తిగతంగా తనకు కూడా నష్టమేనని సోనియా గాంధీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

Show comments