iDreamPost
iDreamPost
ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లాంటి ఇంటర్నేషనల్ ఓటిటిలతో మొదలుపెట్టి హైదరాబాద్ లోకల్ ఆహా దాకా ఎన్నో ఆప్షన్స్ ఉండగా కొత్తవి, ఇంకా మనకు తెలియనివి ఎన్నో పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాటిలోనూ డైరెక్ట్ రిలీజుల తాకిడి బాగానే ఉంటోంది. ఐఓటిటి యాప్ లో తాజాగా విడుదలైన సినిమా చెక్ పోస్ట్ 1995. చైల్డ్ ఆర్టిస్ట్ గా మనకు బాగా పరిచయమున్న మహేంద్ర ఇందులో హీరో. ఆ మధ్య విజయ్ మాస్టర్ లో కూడా నటించాడు. ఇంటెన్స్ రివెంజ్ డ్రామాగా రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ గురించి ప్రమోషన్లు పెద్దగా చేయకపోవడంతో అంతగా ఆడియన్స్ కి రీచ్ కాలేదు. అయినప్పటికీ అంతో ఇంతో జనం దృష్టిలో పడేలా చేశారు. మరి మూవీ ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం
చిన్నప్పుడే రాజు(మహేంద్రన్)తండ్రిని పోలీసుల కాల్పుల్లో చంపేస్తారు. నక్సలైట్ కావడంతో రాజు ముందే ఈ దారుణంగా జరగడంతో అతని మనసులో అది బలంగా ముద్రించుకుపోతుంది. దీనికి కారణమైన ఆఫీసర్ ప్రభాకర్(కాలకేయ ప్రభాకర్)ను ఎలాగైనా హతమార్చాలని ప్రతీకారం పెంచుకుంటాడు. రాజు జీపు నడుపుకునే అనంతగిరి చెక్ పోస్ట్ వద్దకే ప్రభాకర్ ట్రాన్స్ ఫర్ మీద వస్తాడు. ఇతని వల్లే జైలుకు వెళ్లి శిక్ష అనుభవించి బయటికి వచ్చిన అంజయ్య(ఉమా మహేశ్వర్)తో చేతులు కలుపుతాడు. ఇద్దరూ కలిసి ప్రభాకర్ ని లేపేయడానికి స్కెచ్ వేస్తారు ఆ తర్వాత ఏమైంది, నిజంగానే రాజు తండ్రి చనిపోవడానికి కారణాలు ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం సినిమాలో చూడాలి
కమర్షియల్ అంశాలకు చోటివ్వకుండా కేవలం కాన్సెప్ట్ ని మాత్రమే ప్రజెంట్ చేయాలని ప్రయత్నించిన దర్శకుడు రవి కిషోర్ దానికి తగ్గట్టే డీసెంట్ అవుట్ ఫుట్ ఇచ్చాడు. సీరియస్ ఫ్లోలో వెళ్లినప్పటికీ బోర్ కొట్టకుండా రాసుకున్న స్క్రీన్ ప్లే అసలే మాత్రం అంచనాలు లేని ప్రేక్షకులను మెప్పిస్తుంది. క్లైమాక్స్ ఊహించని విధంగా ఇవ్వడం వర్కౌట్ అయ్యింది. వినోద్ సంగీతం, శివకుమార్ ఛాయాగ్రహణం బాగానే ఉన్నాయి. బడ్జెట్ బాగా పరిమితంగా పెట్టుకోవడంతో ఆ ప్రభావం క్వాలిటీ మీద పడింది. అయినప్పటికీ ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ కొన్ని లోపాలను కవర్ చేయగలిగింది. నక్సల్ బ్యాక్ డ్రాప్ అంటే ఆచార్య, విరాటపర్వం లాంటి డిజాస్టర్లు గుర్తొచ్చి భయపడుతున్న ట్రెండ్ లో ఇది వాటి కంటే చాలా నయమని చెప్పొచ్చు.