Idream media
Idream media
మిగతావాళ్ళ సంగతి ఏమోగానీ నా అనుకునేవాళ్లకు ఆపద వస్తే అరక్షణం కూడా ఆలోచించను అంటాడు ఓ సినిమాలో బాలయ్య. సేమ్ అలాగే చంద్రబాబు, చినబాబులు కూడా ప్రజాసమస్యల గురించి ఏమీ ఆలోచించరు గానీ తమవాళ్లకు, తమ మద్దతుదార్లకు సమస్య వస్తే వెంటనే ఆన్లైన్లో ప్రత్యక్షమైపోతారు. వాళ్ళు ఎలాంటివారు? ఏ కారణంతో వారిపై చట్టం చర్యలు తీసుకుంటోందన్నది కూడా బాబులు ఆలోచించరు.
మొన్న అచ్చెన్న, జేసీ బ్రదర్స్ , కొల్లు రవీంద్ర, ఇప్పుడు తాజాగా సబ్బం హరి. ఇలా గత ఆర్నెళ్లుగా కరోనా పేరుచెప్పి హైదరాబాద్ లో దాదాపుగా క్వారెంటయిన్లో గడుపుతున్న బాబులిద్దరూ కార్యకర్తలకు ఏదైనా సమస్య ఎదురైతే చాలు.. వెనకా ముందూ చూడకుండా ట్విట్టర్లోకి వచ్చేస్తున్నారు. అసలు సదరు నాయకులు ఎందుకు చిక్కుల్లోపడుతున్నారు ? ఎందుకు అరెస్ట్ అవుతున్నారన్నది చూడకుండా టకీమని బయల్దేరి ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు. పాత లారీలను బస్సులుగా మార్చేసి, తప్పుడు రిజిస్ట్రేషన్లతో దేశవ్యాప్తంగా నడుపుతున్నందుకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ ను ఆయన కొడుకు ఆస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు వారి అరెస్ట్ వెనుక కారణం ఏమిటన్నది చూడకుండా వెంటనే లోకేష్ అనంతపురం బయల్దేరి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం మీద యథాశక్తి నిందలు మోపి వచ్చేశారు.
ఇక వందలకోట్ల ఈఎస్ఐ అవినీతి కేసులో అరెస్టయిన అచ్చెన్నను పరామర్శించి వచ్చారు. ఆయన దూకుడును అడ్డుకునేందుకు అరెస్ట్ చేసారని మళ్ళీ ఒక స్టేట్మెంట్ పారేశారు. హత్యకేసులో అరెస్ట్ అయిన కొల్లు రవీంద్రను కూడా పరామర్శించి తప్పుడుకేసులో ఇరికించారని బురదజల్లారు.
ఇక విశాఖలో 212 గజాల పార్క్ స్థలాన్ని ఆక్రమించిన సబ్బం హరిని కూడా వెనకేసుకు వస్తున్నారు. అక్రమనిర్మాణాలను విశాఖ మున్సిపల్ అధికారులు కూల్చేయగా అది కూడా కక్షసాధింపు అంటూ కామెంట్ చేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని చూసిన చంద్రబాబు ఇలా అక్రమార్కులను, అవినీతిపరులు, తప్పుడు పనులు చేసేవాళ్లను వెనకేసుకు రావడం ఏమిటని కార్యకర్తలే లోలోన బుగ్గలు నొక్కుకుంటున్నారు. అక్కడ హైదరాబాద్ లో చేసేందుకు ఏమి పని లేక ఇలాంటి ఏదో ఒక సాకు వెతుక్కుని ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నిస్తూ తండ్రీకొడుకులు ఇద్దరూ పరువు కోల్పోతున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.