Idream media
Idream media
ఇటీవలి కాలంలో చంద్రబాబు రాజకీయాల్లో మార్పును చాలా మంది గమనించి ఉంటారు. ఆలయాలపై దాడుల ఘటనపై ఆయన స్పందనలోను, అరెస్టులు, హత్యలు జరిగిన సందర్భాల్లో విమర్శల తీరులోనూ గతానికి భిన్నంగా వ్యవహరించారు. చివరకు ఏడ్చైనా సాధించాలనే స్థితికి వచ్చారు. ఇప్పుడు కొత్తగా సినిమా రివ్య్యూలు కూడా మొదలుపెట్టారు.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ మూవీ టాలీవుడ్‌కు ఊపిరి పోసిందని చిత్ర ప్రముఖులందరూ భావిస్తున్నారు. అఖండ సినిమాపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. అఖండ మూవీని తాను ఇటీవల చూసినట్లు చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. మంగళగిరి టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది అఖండ సినిమాలో చూపించారని చెప్పారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఈ సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారని… సినిమా చాలా బాగుందని చంద్రబాబు కితాబిచ్చారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అఖండ సినిమాను కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయడం ఆలోచించదగ్గ విషయం. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా చాలా బాగుందని చంద్రబాబు నాయుడు ప్రశంసించడం ఓకే కానీ.. దానికీ, రాజకీయానికీ ఆయన ముడి పెట్టారు. ఏపీలో ప్రస్తుత స్థితి అఖండ సినిమాలో చూపినట్టుగా ఉందట! ఇదీ చంద్రబాబు ఈ సినిమా గురించి చేసిన విశ్లేషణ. ఇలా బాలకృష్ణ సినిమాను చంద్రబాబు నాయుడు రాజకీయానికి వాడుకునే ప్రయత్నం చేశారు. ఇది వరకూ ఎన్టీఆర్ బయోపిక్ సెకెండ్ పార్ట్ విడుదలైనప్పుడు చంద్రబాబు నాయుడు ఇలానే మాట్లాడారు. తనంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఎన్టీఆర్, ప్రజానాయకుడు సినిమాను చూడాలని అప్పట్లో చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన చాలా మందికి నవ్వులు తెప్పించింది.
ఆ సినిమాలో నాదెండ్ల వెన్నుపోటు వ్యవహారంలో ఎన్టీఆర్ ను తిరిగి పీఠంపై కూర్చోబెట్టిందంతా చంద్రబాబే అన్నట్టుగా చూపిన వైనాన్ని చంద్రబాబు తన గొప్పదనానికి అది నిదర్శనం అని చెప్పుకున్నారు. అయితే ఆ తర్వాత నాదెండ్ల కన్నా విజయవంతంగా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది తనే అని ప్రజలు మరిచిపోయారని చంద్రబాబు అనుకున్నారేమో. అయితే.. ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు హీరోయిజం గురించి అంతలా చూపినా.. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నప్పుడు ఆ సినిమా విడుదలైనా ప్రజలు చంద్రబాబును తిరస్కరించారు. అయినా.. ఆయన సినిమాలతో రాజకీయాలను ముడిపెట్టడం మానుకోలేదు.
Also Read : మంచి ఛాన్స్, బాబు ఎందుకు వైసీపీ కి ఇవ్వాలనుకుంటున్నారు..?