iDreamPost
iDreamPost
లైఫ్ స్టైల్ వల్లనో, తినే తిండిలో తగిన పోషకాలు లేకపోవడమో, జన్యుపరమైన లోపమో, కారణమేదైనా కానీ ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే బట్టతల వచ్చేస్తోంది. పాతికేళ్లైనా రాని యువతలో ఈ సమస్య ఎక్కువ అవుతోంది. బట్టతల వస్తే బాగుండరని చాలామంది ఫీలింగ్. పెళ్లిచేసుకొనే అమ్మాయిలుకూడా జట్టువంక చూస్తున్నారు. ఇక బట్టతల ఉన్నవారిని చాలా మంది హేళన చేస్తుంటారు. అలా బాల్డ్ హెడ్ అంటూ వెక్కిరించడం కూడా లైగింక వేధింపు (Sexual Harassment) చర్య కిందకే వస్తుందని ఇంగ్లండ్ కు చెందిన ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది.
ఓ కంపెనీలో పనిచేస్తోన్న టోనీ(64)ని సూపర్ వైజర్ ఎగతాళి చేశాడు. నీకు బట్టతల ఉందంటూ నవ్వడంతో టోనీకి కోపమొచ్చింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. టోనీని ఉద్యోగంలో నుంచి తీసేశారు. బట్టతలపై కామెంట్ చేయడమే కాకుండా, తనను అన్యాయంగా ఉద్యోగంలో నుంచి తొలగించారంటూ వెంటనే ఫిర్యాదు చేశాడు. టోనీ ఫిర్యాదు పై బ్రిటీష్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ విచారణ జరిపింది. “బట్టతల” అని పిలవడం ఇకపై లైంగిక వేధింపు కిందకు వస్తుందని పేర్కొంటూ బ్రిటిష్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. పురుషుడి బట్టతలపై కామెంట్ చేయడం, స్త్రీ రొమ్ము పరిమాణంపై వ్యాఖ్యానించడంతో సమానమని ట్రిబ్యునల్ పేర్కొంది. అలాగే టోనీకి సదరు కంపెనీ నష్టపరిహారాన్ని చెల్లించాలని తెలిపింది.