Idream media
Idream media
కరోనా కాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ భారీగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా నేపథ్యంలో డిజిటిల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూ వస్తోంది. ఇప్పుడు త్వరలో డిజిటల్ రూపాయలను కూడా ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ లో ప్రకటించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాదిలోనే డిజిటల్ రూపాయలను తెస్తుందని వెల్లడించారు. డిజిటల్ రూపాయి కూడా క్రిప్టో కరెన్సీ మాదిరిగా ఉంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. దీంతో పాటు డిజిటల్ అసెట్స్ ఆస్తుల లాభాల స్వీకరణపై 30 శాతం పన్ను కేంద్రం విధించింది. అలాగే అసెట్స్ ట్రాన్సాక్షన్స్ పై ఒక శాతం టీడీఎస్ కోత విధించనున్నట్లు పేర్కొంది. దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. క్రిప్టో పెట్టుబడుదారులకు ఝలక్ లాంటిదని కొందరు అభివర్ణిస్తే, కేంద్రమే దీనిపై దృష్టి పెట్టడం వల్ల పెట్టుబడిదారులకు భరోసా కల్పించినట్లు అయిందని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.
బ్లాక్ మనీని కట్టడి చేయడానికి అంటూ డిజిటల్ మనీని తెరపైకి తెచ్చేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే డిజిటల్ మనీని పోలిన క్రిప్టో కరెన్సీ గురించి ప్రపంచ వ్యాప్తంగా కొద్ది కాలంగా చర్చ జరుగుతోంది. భౌతిక కరెన్సీకి భిన్నంగా ఈ క్రిప్టో కరెన్సీ ఉంటుంది. అలాంటిది భారతదేశంలో సాధ్యమా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ డిజిటల్ రూపీని తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇది ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. సాధారణ కరెన్సీ నోటు లేదా నాణేన్ని మనం భౌతికంగా చూస్తాం. చేతితో తాకుతాం. క్రిప్టో కరెన్సీ కంప్యూటర్ లోనే జనించే డిజిటల్ కరెన్సీ, దానికి భౌతిక రూపం లేదు. కాబట్టి తాకలేము. అయితే క్రిప్టో కరెన్సీపై ఇప్పటి వరకు ప్రభుత్వ నియంత్రణ ఉండేది కాదు. త్వరలో దీన్ని కూడా ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డిజిటల్ ఎకానమీకి డిజిటల్ కరెన్సీ బిగ్ బూస్ట్ గా పని చేస్తుందని సీతారామన్ పేర్కొన్నారు. అందులో ఎంత వరకు వాస్తవమనేది డిజిటల్ సమగ్రరూపం తెలిస్తేకానీ చెప్పే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు. డిజిటల్ అసెట్స్ ఆస్తుల లాభాల స్వీకరణపై 30 శాతం పన్ను అనేది అమెరికా వంటి దేశాల్లో అమల్లో ఉంది. అందుకే ఆయా దేశాల్లో దీనిపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారని, దేశంలో కూడా మరింత పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఏర్పడతాయని పలువురు పేర్కొంటున్నారు. ఏదేమైనా తాజా బడ్జెట్ ద్వారా భారతదేశంలో కూడా డిజిటల్ డబ్బులు చలామణిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది స్పష్టం అవుతోంది.
Also Read : బడ్జెట్ 2022–23 : తొలిసారి ప్రకృతి వ్యవసాయం మాట