iDreamPost
iDreamPost
దొంగలందు మంచి దొంగ వేరయా.. చెడ్డవారియందు మంచి చెడ్డవారు వేరయా.. అంటూ కొత్త భాష్యం చెబుతున్నారు కమలనాథులు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఢిల్లీలో తమ మాట చెల్లక.. కేంద్రం మరింత స్పష్టంగా ప్రైవేటీకరణపై కుండబద్దలు కొట్టాక కొద్దిరోజులుగా మొహం చెల్లని బీజేపీ నేతలు.. ఇప్పడు ప్రైవేటీకరణలోనూ మంచిని చూపిస్తామంటున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ, విశాఖకే చెందిన పీవీఎన్ మాధవ్ తాజాగా చేసిన ప్రకటన ఆ పార్టీ రాష్ర్ట నేతల్లో నెలకొన్న అయోమయానికి, కేంద్రాన్ని ఒప్పించలేక.. ఏదోలా సమర్థించుకోవాలన్న ధోరణిని స్పష్టం చేస్తోంది. ఎమ్మెల్సీ మాధవ్ ప్రకటన ఈ కోవలోకే వస్తుంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణలో సంస్థ ఉద్యోగులకు, విశాఖకు అన్యాయం జరగకుండా చూస్తారని.. ఉన్నంతలో మంచిగానే ప్రైవేటీకరణ జరుగుతుందని భరోసా ఇచ్చేశారు. ప్రత్యామ్నాయాలు ఆలోచించకుండా.. ప్రైవేటీకరణకు పూనుకోవడమే తప్పంటుంటే.. అందులో మళ్ళీ మంచి ప్రైవేటీకరణ ఏముంటుందబ్బా.. అని స్థానికులు, ఆందోళనకారులు తలలు పట్టుకుంటున్నారు. మాధవ్ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్వరం మార్చిన రాష్ర్ట బీజేపీ
మొన్నామధ్య లోక్‌సభలో ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవిల ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్.. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం జరిగిపోయిందని, దాన్నుంచి వెనక్కు వెళ్ళే పరిస్థతి లేదని స్పష్టం చేశారు. ఆ మరుసటి రోజే ఒక ఒడిశా ఎంపీ అడిగిన ప్రశ్నకు ఉక్కు శాఖ మంత్రి సమాధానమిస్తూ విశాఖ స్టీల్‌ప్లాంట్ సొంత గనుల్లేకపోవడం వల్లే నష్టాలపాలైందని పేర్కొన్నారు. సొంత గనులు కేటాయించాలని యాజమాన్యం, రాష్ర్ట ప్రభుత్వం చాలాకాలంగా కోరుతున్న విషయాన్నీ అంగీకరించారు. ఆర్ ఐ ఎన్ ఎల్‌ను వేరే ప్రభుత్వరంగ సంస్థల్లో విలీనం చేయడం లేదా ప్రైవేటీకరించడం అదీ కుదరకపోతే మూసివేయడం తథ్యమని స్పష్టం చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు ఉక్కు మంత్రి స్పందిస్తూ ఉత్పత్తి ఖర్చులు పెరగడం, స్టీల్ పరిశ్రమలో మాంద్యం, అమ్మకాలు తగ్గడం వల్ల విశాఖ ప్లాంట్ నష్టాలు ఎదుర్కొందని.. ఇప్పుడిప్పుడే ఆ నష్టాలు తగ్గించుకుంటోందని వివరించారు.
Also Read : గ్రేటర్ విశాఖ ఫలితాలపై స్టీల్ ప్లాంట్ ఎఫెక్ట్
కేంద్ర మంత్రులు సమాధానాలు ఇలా ఉంటే బీజేపీ రాష్ర్టనేతలు తడకోమాట చెబుతూ.. రోజుకో వాదన వినిపిస్తూ తమలోని గందరగోళాన్ని ప్రజల నెత్తిన రుద్దుతున్నారు. ప్రైవేటీకరణ అంశం వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో కేంద్రం నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అయితే అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా కేంద్రాన్ని అడ్డుకుంటామని చెప్పి ఢిల్లీ వెళ్ళిన బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులు ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులను కలిశారు. అమిత్‌షా, మోదీల అపాయింట్‌మెంట్ మాత్రం పొందలేకపోయారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి మాట్లాడారు, వినతిప్రతాలు ఇచ్చారు. అక్కడ ఏం జరిగిందో గానీ.. తిరిగి వచ్చినప్పటి నుంచి స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరిస్తారని ఎవరు చెప్పారంటూ ఎదురుదాడి ప్రారంభించారు.
అసలు కేంద్రం అటువంటి నిర్ణయమే తీసుకోలేదని, అవాస్తవాలు ప్రచారం చేసి ప్లాంట్ ఉద్యోగులను, కార్మికులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్‌ప్లాంట్‌కు ఏమీ కాదని భరోసా ఇచ్చారు. కట్ చేస్తే.. ఆ తర్వాత వరుసగా మూడు రోజుల్లో పలువురు ఎంపీలు అడిగిన వేర్వేరు ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాల్లో విశాఖ స్టీల్ తథ్యమని కేంద్ర మంత్రులు స్పష్టం చేయడం.. దాంతో ఆగ్రహోదగ్రులైన స్టీల్ పరిరక్షణ కమిటీ ప్రతినధులు దాదాపు ఒక రోజంతా స్టీల్‌ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద బైఠాయించి.. జాతీయ రహదారి దిగ్బంధించడం తెలిసిందే. ఈ పరిణామాలతో బీజేపీ నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. ఏం చెప్పాలో తెలియని స్థతిలో.. అదేరోజు జరిగిన జీవీఎంసీ పోలింగ్‌లోనూ ఆ పార్టీ నేతల జాడ కనిపించలేదు. తాజగా ఎమ్మెల్సీ మాధవ్ మాత్రం ప్రైవేటీకరణలో మంచి జరిగేలా చూస్తారన్నట్లు స్టేట్‌మెంట్ ఇచ్చి మరింత నగుబాటుకు గురయ్యారు.
జాడలేని పవనకల్యాణ్
బీజేపీ మిత్రుడైన జనసేనాని పవన్‌కల్యాణ్ కూడా దాదాపు ఇలాగే ద్వైదీభావంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్ళలో తన శైలిలో తీవ్రంగానే స్పందించిన ఆయన ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో మాట్లాడి సమస్య పరిష్కరించేస్తానన్నంత బిల్డప్ ఇచ్చారు. బీజేపీ నేతల్లాగే.. తను కూడా నాదెండ్ల మనోహర్‌ను వెంటబెట్టకొని ఢిల్లీ బాస్‌లను కలిశారు. వారితో ఏం మాట్లాడారో.. వారు ఏం చెప్పారో తెలియదు గానీ.. ఆ తర్వాత పవన్ స్వరం మారిపోయింది. అంతవరకు ప్రైవేటీకరణ ప్రతిపాదనపై కస్సుబుస్సులాడిన ఆయన.. ఒక్క విశాఖ స్టీల్‌ప్లాంట్‌నే కాకుండా.. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ దశలవారీగా ప్రైవేటీకరించడానికి విధాన నిర్ణయం తీసుకుందంటూ.. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిలా మాట్లాడారు. పనిలో పనిగా రాష్ర్టంలోని వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు గుప్పించారు. ప్రైవేటీకరణను అడ్డుకోవాల్సిన బాధ్యత రాష్ర్ట ప్రభుత్వానిదేనని తేల్చేశారు. ఆ పార్టీకి ఎంపీలున్నందున వారే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి.. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీకి ఎంపీలు లేనందున తాము వీధులకెక్కి ఆందోళనలు చేస్తామన్నారు. పోనీ అదైనా చేస్తున్నారా అంటే.. అదీ లేదు. ఉక్కు పరిరక్షణకు జరుగుతున్నుఉద్యమంలో పాల్గొనమని తన పార్టీ శ్రేణులకు ఆయన ఇంతవరకు ఒక్క పిలుపైనా ఇవ్వలేదు. తను పోటీ చేసిన గాజువాక నియోజకవర్గ పరిధిలోని భారీ పరిశ్రమ పరిరక్షణకు జరుగుతున్న ఆందోళనల్లో తనైనా ప్రత్యక్షంగా పాల్గొనాలన్నా ఆలోచన ఆయనలో కలగకపోవడం గమనార్హం
Also read : మరో దశకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం
పవన్ ఉద్యమంలోకి రావాలి: లక్ష్మీనారాయణ
స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్వయంగా పాల్గొనాలని సీబీఐ మాజీ జేడీ, మాజీ జనసేన నేత లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. విశాఖలో శుక్రవారం ఆయన ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్ని పార్టీలు, అందరూ నాయకులు కలిసికట్టుగా ఉద్యమిస్తేనే ఉక్కను పరిరక్షించుకోగలమని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ వద్దకు అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్తానన్న సీఎం జగన్ ప్రతిపాదనను ఆయన స్వాగతించారు. తనను ఆహ్వానిస్తే బృందంలో సభ్యుడిగా వెళ్ళేందుకు సిద్ధమేనని చెప్పారు. కాగా స్టీల్‌ప్లాంట్ సమ్మె ప్రతిపాదన సమంజసం కాదన్నారు. సమ్మె వల్ల ఉత్పత్తి నిలిచిపోయి.. ప్లాంట్‌కు మరింత నష్టం వాటిల్లుతుందన్నారు. ఇప్పటికే ఉక్కు ప్రైవేటీకరణకు నష్టాల సాకునే చూపిస్తున్న కేంద్రానికి మరింత అవకాశం ఇచ్చినట్లవుతుందని లక్ష్మీనారాయణ అన్నారు.