బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది ? విద్యార్థులెందుకు రోడ్డెక్కారు ? విద్యుత్, నీటిసరఫరా ఎందుకు కట్ చేశారు ?

బాసర ట్రిపుల్ ఐటీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తమ సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ.. విద్యార్థులు రోడ్డెక్కి మూడ్రోజులు అవుతోంది. మూడోరోజు గురువారం క్యాంపస్ గేటువద్ద విద్యార్థులు భారీగా బైఠాయించి మౌన నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న తమకు యాజమాన్యం కనీసం తాగునీటిని కూడా అందించకుండా.. మంచినీటి సరఫరా ఆపివేశారని ఆరోపించారు. శాంతియుతంగా పోరాటం చేస్తున్నా నీళ్లు, విద్యుత్ సరఫరా ఆపివేసి.. కావాలనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తమ ఓపికను పరీక్షిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని విద్యార్థులు హెచ్చరించారు.

విద్యార్ధుల ఆందోళనలతో అలర్ట్ అయిన తెలంగాణ విద్యాశాఖ.. బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ సతీశ్ కుమార్ ను నియమించింది. డైరెక్టర్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు.. డైరెక్టర్ నియామకం వల్ల సమస్యలు తీరవని, తాము ప్రభుత్వం ముందు ఉంచిన 12 డిమాండ్లను పూర్తిగా నెరవేరిస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చిచెప్పారు. నిన్నే విద్యార్థులతో చర్చించిన అధికారులు.. మరోసారి విద్యార్థులతో చర్చించేందుకు సిద్ధమన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనపై ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ స్పందించారు. మూడేళ్లుగా ప్రభుత్వం నుంచి విద్యార్థులకు అందాల్సిన ల్యాప్ టాప్ లు, యూనిఫారమ్ అందకపోవడంతో పాటు.. క్యాంపస్ లు మరిన్ని సమస్యలున్నాయని, అందుకే విద్యార్థులు నిరసన బాటపట్టారన్నారు.

కాగా.. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని భైంసా ఏఎస్పీ కిరణ్‌ కారే తెలిపారు. విద్యార్థులకు ఆహారం, నీళ్లు నిలిపేశామనడం అవాస్తవమని వివరించారు.

 

Show comments