iDreamPost
iDreamPost
టెక్నాలజీతో పాటు మనమూ మారాలి.. ఎదగాలి అంటుంటారు. ఆ టెక్నాలజీ మంచి కన్నా చెడుకే ఎక్కువ ఉపయోగపడుతున్నట్లుగా ఉంది. ఈ రోజుల్లో జరుగుతున్న సైబర్ నేరాలను చూస్తే.. ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. సోషల్ మీడియాలో పరిచయాలు చేసుకుని.. డబ్బులు దండుకోవడం ఒక తరహా సైబర్ క్రైమ్ అయితే.. పెద్దపెద్ద వాళ్లు పేర్లు ఉపయోగించుకుని జనాలను మోసం చేసి డబ్బులు తీసుకోవడం మరో తరహా సైబర్ క్రైమ్. తాజాగా సైబర్ నేరస్తులు ఏకంగా డీజీపీ పేరునే వాడేశారు.
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పేరుతో 97857 43029 నెంబర్‌కు డీజీపీ ఫొటో పెట్టి.. సైబర్ మోసాలకు తెరలేపారు. ఎవరికైనా డీజీపీ నుంచి మెసేజ్ వచ్చినట్లు ఉంటే వెంటనే సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖులు, సామాన్యులకు డీజీపీ పేరుతో సైబర్ నేరగాళ్లు మెసేజ్‌లు పంపుతున్నారు. దీనిపై ఆరా తీసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీజీపీ మహేందర్ రెడ్డి ఈ కేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నేరస్తులను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు.