iDreamPost
android-app
ios-app

ఆత్మ రక్షణలో నిమ్మగడ్డ..!

ఆత్మ రక్షణలో నిమ్మగడ్డ..!

రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఇచ్చిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ఏపీ హైకోర్టు నిలిపివేయడంతో ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారా..? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఈ రోజు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌తో బేటీ కావడం ఆయన ఎంత ఒత్తిడిలో ఉన్నారో స్పష్టమవుతోంది. హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పును డివిజనల్‌ బెంచ్‌లో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. డివిజనల్‌ బెంచ్‌ తీర్పు ఎలా ఉంటుందనేది మరికొద్ది గంటల్లో తెలిసే అవకాశం ఉంది.

వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏమిటో..?

అయితే ఈ లోపే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. గవర్నర్‌తో భేటీ అవడం చర్చనీయాంశమవుతోంది. తన నిర్ణయంపై డివిజనల్‌ బెంచ్‌లోనూ చుక్కెదురు కావడం ఖాయమనే భావనలో నిమ్మగడ్డ ఉన్నారా..? అందుకే ముందుగానే గవర్నర్‌ను కలిశారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఎన్నికల షెడ్యూల్‌ను తాను ఏ పరిస్థితుల్లో ఇచ్చిందీ నిమ్మగడ్డ గవర్నర్‌కు వివరించారు. దీనిపై నిమ్మగడ్డ గవర్నర్‌కు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా.. పనిగట్టుకుని వెళ్లి సంజాయిషీ ఇవ్వడమే ఇక్కడ గమనించాల్సిన విషయం. పైగా ఎప్పటిలాగే రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదుల కూడా చేశారు. ప్రభుత్వం తనకు సహకరించడంలేదంటూ పాతపాటే పాడిన నిమ్మగడ్డ ఆంతర్యం ఏమిటో డివిజనల్‌ బెంచ్‌ తీర్పు తర్వాత తెలిసే అవకాశం ఉంది.

ఇరు వైపులా ఒత్తిడి..

రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా నిమ్మగడ్డ విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను కోర్టు నిలిపివేయడంతో ఇప్పటి వరకూ ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్నీ తప్పని, ఉద్దేశపూర్వకంగానే చేశారని ప్రజలకు అర్థమైంది. ఎన్నికల కోడ్‌ అమలు పేరుతో పథకాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన నిమ్మగడ్డ బొక్కబోర్లా పడ్డారు. అంతటితో ఆగకుండా తన విభాగం ఉద్యోగులపైనే కత్తి దూశారు. కమిషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ) సాయి ప్రసాద్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. పైగా భవిష్యత్‌లో సాయి ప్రసాద్‌ ప్రభుత్వంలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పని చేయడానికి లేదంటూ ఆదేశాలు జారీ చేసి దుమారానికి తెరలేపారు. హైకోర్టు తీర్పుతో ఈ నిర్ణయాలన్నీ బెడిసికొట్టడంతో ఏం పాలుపోకే నిమ్మగడ్డ.. గవర్నర్‌ వద్దకు వెళ్లారనే టాక్‌ నడుస్తోంది.

Read Also : ఎస్‌ఈసీ రిట్‌ పిటిషన్‌.. విచారణ వాయిదా..