Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి ఏమిటో ఒక్కొక్కరుగా గుర్తిస్తున్నారు. ఒంటెద్దు పోకడలు, ఏకపక్షంగా వ్యవహరించడం, తానుపట్టిన కుందేలుకు మూడేకాళ్లు అనేలా వ్యవహరిస్తుండడంపై గతంలో నిమ్మగడ్డకు మద్ధతుగా ఉన్న వాళ్లు ప్రస్తుతం ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో హడావుడిగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ మండిపడ్డారు. నిమ్మగడ్డ తీరు ఏకపక్షంగా ఉందని ఆక్షేపించారు. గతంలో తాము నిమ్మగడ్డకు మద్ధతుగా ఉన్నామని, అయితే ఆయన తీరు ఏకపక్షంగా ఉందని మండిపడ్డారు. ఎవరిని సంప్రదించి పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారో చెప్పాలని సాకే డిమాండ్ చేయడం నిమ్మగడ్డ తీరుపై ఏపీలోని రాజకీయ పార్టీలు, నేతల్లో వస్తున్న మార్పునకు నిదర్శనంగా నిలుస్తోంది.
రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని.. నిమ్మగడ్డ ఒక్కరే ఎలా తీసుకుంటారని కూడా సాకే ప్రశ్నించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మన్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఆ ప్రక్రియను రద్దు చేయాలంటూ తామిచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. రమేష్‌కుమార్ వ్యవహార శైలి సరిగా లేదని సాకే ఆక్షేపించారు. తక్షణమే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కరోనాతో ఒక్కరు కూడా చనిపోకూడదని గతంలో తాము లెటర్ ఇచ్చామని, ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో నిమ్మగడ్డ వెల్లడించాలని సాకే డిమాండ్ చేశారు. ఎన్నికలకు తాము సిద్ధమని, అయితే నిమ్మగడ్డ చిత్తశుద్ధిపై తమకు అనుమానం ఉందని సాకే శైలజానాథ్ అన్నారు.