Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధాప్య పింఛన్ అందుకుంటున్న లబ్ధిదారులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. పింఛన్ సొమ్మును పెంచాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. మరో 250 రూపాయలు పెంచాలని జగన్ సర్కార్ ఈ రోజు నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఇస్తున్న 2,250 రూపాయల మొత్తం 2500 రూపాయలు కానుంది. పెంచిన పింఛన్ సొమ్మును వచ్చే నెల నుంచి లబ్ధిదారులకు అందించనున్నారు. నూతన సంవత్సరం కానుకగా.. వృద్ధులు 2500 చొప్పున పింఛన్ నగదును అందుకోబోతున్నారు.
2017లో సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదాలో పింఛన్ పెంపు హామీని ఇచ్చారు. అప్పుడు వృద్ధులు వేయి రూపాయల చొప్పన ఫించన్ అందుకుంటున్నారు. తాను అధికారంలోకి వస్తే.. ఆ మొత్తం 2 వేల రూపాయలు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఈ హామీని చూసి చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు రెండు వేల రూపాయలు చేస్తే.. ఆ మొత్తాన్ని మూడు వేల వరకు పలు దఫాలుగా పెంచుతానని చెప్పారు. జగన్ అనుమానించినట్లే.. చంద్రబాబు చేశారు.
జగన్ ముందుగా చెప్పినట్లుగానే.. తాను అధికారంలోకి వస్తే.. వృద్ధాప్య పింఛన్∙మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పారు. పలు దఫాలుగా పింఛన్ మొత్తం మూడు వేల రూపాయలు చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పొందుపరిచారు. ఇచ్చిన హామీని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. వృద్ధాప్య పింఛన్ సొమ్ము 2 వేల రూపాయల నుంచి 2,250 రూపాయలకు పెంచారు. ఆ మొత్తాన్ని ప్రతి నెలా క్రమం తప్పకుండా అందిస్తున్నారు. ప్రతి ఏడాది 250 రూపాయల చొప్పన పెంచుతూ.. మూడు వేల రూపాయలు చేస్తానని ప్రమాణస్వీకారం రోజు మరోసారి చెప్పారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాతి సంవత్సరమే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. 2020 ప్రారంభంలో మొదలైన కరోనా వైరస్.. ఇప్పటికీ తన ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వాలకు రాబడి పడిపోయింది. మరో వైపు ఇతర హామీలను అమలు చేయాల్సి రావడంతో.. పింఛన్ సొమ్ము పెంపు జరగలేదు. అయితే పరిస్థితులు సద్ధుమనగడంతో.. కొత్త సంవత్సరంలో పింఛన్ సొమ్మును పెంచాలని జగన్ ఈ రోజు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ వరకు 2500 రూపాయల చొప్పన పింఛన్‌దారులు సొమ్మును అందుకుంటారు. 2023 జనవరిలో మరో దఫా 250 రూపాయలు, 2024 జవవరిలో చివరి దఫా 250 రూపాయలు పెంచడం వల్ల.. జగన్ ఇచ్చిన హామీ అమలు సంపూర్ణం అవుతుంది.
Also Read : అంతలో ఎంత మార్పు.. అన్నదాతకు అక్కడ మళ్లీ గౌరవం
ఒకటో తేదీ.. ఇంటి వద్దనే ఫించన్..
వైఎస్ జగన్ వచ్చిన తర్వాత ఫించన్ సొమ్ము పంపిణీ విధానంలోనూ సమూల మార్పులు చేశారు. పింఛన్ తీసుకునేందుకు వృద్ధులు పడుతున్న అగచాట్లను పాదయాత్ర సమయంలో చూసిన వైఎస్ జగన్… ఇంటి వద్దనే వారికి పింఛన్ ఇచ్చేలా వలంటరీ విధానం ప్రవేశపెట్టారు. ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంచన్‌గా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వలంటీర్లు పింఛన్ సొమ్మును అందిస్తున్నారు. వేలిముద్రలు పడకపోవడం వంటి కారణాలు చూపుతూ పింఛన్ పంపిణీ వాయిదా వేయకుండా.. ప్రతి ఒక్కరికీ ఒకటో తేదీనే పింఛన్ అందిస్తున్నారు. ఎవరైనా ఆ రోజు తీసుకునేందుకు అందుబాటులో లేకపోతే మరుసటి రోజు అందిస్తున్నారు. ప్రతి నెలా మొదటి మూడు రోజుల్లోనే రాష్ట్రంలో 60 లక్షలకుపైగా లబ్ధిదారులకు పింఛన్ అందిస్తున్నారు.